AP Special Category Status : ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు-delhi union minister srinivasa varma sensational comments ap special category status ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Special Category Status : ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు

AP Special Category Status : ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Jul 03, 2024 03:52 PM IST

AP Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వస్తుంది. తాజాగా ప్రత్యేకహోదాపై నర్సాపురం బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ స్పందించారు. ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదన్నారు.

ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు- కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు- కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

AP Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఏళ్ల తరబడి వినిపిస్తుంది. ఎన్డీఏ-1లో టీడీపీ భాగస్వామి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అందించారు. వైఎస్ జగన్ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని 2019లో అధికారం చేపట్టారు. గత ఐదేళ్లు ప్రత్యేక హోదా కోసం చాలా సార్లు దిల్లీ వెళ్లివచ్చారు. కానీ ప్రత్యేక హోదా అందని ద్రాక్షలా మిగిలిపోయింది. ఇక 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసే స్థాయిలో నిలబడింది. ఇదే మంచి తరుణమని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడాలని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

ప్రత్యేక హోదాపై మరోసారి చర్చ మొదలవ్వడంతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వమే ఉందన్నారు. ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదన్నారు. తీర్మానాలతో ప్రత్యేక హోదా వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇలా చేస్తాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తన పరిధిలోని అంశం కాదని, దీనిపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలన్నారు. బిహార్‌కు కూడా ఇదే వర్తిస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదో గతంలో ఆర్థిక సంఘం స్పష్టం చేసిందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు. ఆ నిధులతో ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యంతో పోలవరం ప్రాజెక్టు సమస్యల్లో కూరుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇవాళ సాయంత్రం దిల్లీలో ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.

ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో వర్గీకరణ చేస్తుంది. ఇది అభివృద్ధికి ఆర్థిక సహాయం, పన్ను ప్రయోజనాలను పొందడానికి అర్హత కల్పిస్తుంది. 5వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 1969లో దీన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ఏ రాష్ట్రానికైనా అదనపు నిధులు ఇవ్వడానికి అనుమతిస్తుంది. అయితే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి ఏమీ చెప్పలేదు. 2014 ఆగస్టులో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయగా, 2015 ఏప్రిల్‌లో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వర్గీకరణను తొలగించింది. దీనికి బదులుగా రాష్ట్రాలకు పన్ను బదలాయింపును 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అయితే అప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు దాన్ని నిలబెట్టుకుంటాయి, కానీ కొత్త రాష్ట్రాలు ఆ జాబితాలో చేరవని స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఆశలు అడియాశలు అయ్యాయి.

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక సాయం అందుతుంది. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ఆధారంగా ఇలాంటి రాష్ట్రాలు మొత్తం కేంద్ర సహాయంలో 30% గ్రాంట్లను పొందుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు అనుకూలమైన నిధుల నిష్పత్తి వల్ల కూడా వారు ప్రయోజనం పొందుతారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చులను భరిస్తుంది. రాష్ట్రం 10% మాత్రమే భరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా జనరల్ కేటగిరీలోని రాష్ట్రాలు 40 శాతం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు తక్కువ పన్ను రేట్లు కలిగి ఉంటాయి. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, ఇన్‌కమ్ టాక్స్, కార్పొరేట్ పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవేకాకుండా అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం