ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కుతుందా? హోదా వల్ల లాభాలేంటి?-special category status and what it means for the new government ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కుతుందా? హోదా వల్ల లాభాలేంటి?

ఏపీ, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కుతుందా? హోదా వల్ల లాభాలేంటి?

HT Telugu Desk HT Telugu
Jun 10, 2024 04:12 PM IST

Special category status: సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైన బీజేపీ బీహార్, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోసం తన మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీల దీర్ఘకాలిక డిమాండ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం సంకీర్ణ రాజకీయాల పునరాగమనాన్ని సూచిస్తుంది. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 స్థానాలను గెలుచుకోవడంలో విఫలమైంది. ఆ పార్టీ 240 సీట్లను గెలుచుకుంది. సంకీర్ణ కూటమిలోని పార్టీలకు ఉమ్మడి ఎజెండా ఉంది. కూటమిలోని ప్రధాన భాగస్వాములైన టీడీపీ, జేడీయూ తమ రాష్ట్రాలకు అంటే ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టే అవకాశం చిక్కింది.

టీడీపీ 16 సీట్లు, జేడీ(యు) 12 స్థానాలను గెలుచుకున్నందున వారి డిమాండ్లను ఎన్‌డిఎ ప్రభుత్వం విస్మరించడం కష్టం. ఇదే అంశంపై 2018లో ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలిగిన టీడీపీ మళ్లీ ప్రత్యేక హోదా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో వర్గీకరణ చేస్తుంది. ఇది అభివృద్ధికి ఆర్థిక సహాయం, పన్ను ప్రయోజనాలను పొందడానికి అర్హత కల్పిస్తుంది. 5వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 1969లో దీన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ఏ రాష్ట్రానికైనా అదనపు నిధులు ఇవ్వడానికి అనుమతిస్తుంది. అయితే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి ఏమీ చెప్పలేదు.

2014 ఆగస్టులో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయగా, 2015 ఏప్రిల్‌లో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వర్గీకరణను తొలగించింది.  దీనికి బదులుగా రాష్ట్రాలకు పన్ను బదలాయింపును 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అయితే అప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు దాన్ని నిలబెట్టుకుంటాయి, కానీ కొత్త రాష్ట్రాలు ఆ జాబితాలో చేరవని స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఆశలు అడియాశలు అయ్యాయి.

దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి?

ఏ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్లను పరిగణనలోకి తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. 14వ ఆర్థిక సంఘాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది ఈ హోదాను అదనంగా ఇవ్వబోమని పునరుద్ఘాటించారు. 

ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది?

ప్రస్తుతం భారతదేశంలో 12 రాష్ట్రాలకు ఈ హోదా ఉండగా, మరో ఐదు రాష్ట్రాలు ఈ హోదాను కోరుకుంటున్నాయి. 1969లో జమ్మూకశ్మీర్ (2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది), అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. 1969 నుండి 1974 వరకు 4 వ పంచవర్ష ప్రణాళికలో ఈ రాష్ట్రాలు మొత్తం సహాయంలో 9.26% పొందాయి.

1974 నుంచి 1978 వరకు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఈ జాబితాలో చేరాయి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలకు 1990లో, ఉత్తరాఖండ్‌కు 2000లో ప్రత్యేక హోదా కల్పించారు. ఆంధ్రప్రదేశ్ , బీహార్, ఒడిశా, రాజస్థాన్, గోవా రాష్ట్రాలు ఈ హోదాను కోరుతున్నాయి.

ప్రత్యేక హోదా పొందడానికి ప్రమాణాలు ఏమిటి?

ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే వనరుల కొరత, తలసరి ఆదాయం తక్కువగా ఉండటం, ఆర్థిక, నిర్మాణాత్మక అభివృద్ధిలో వెనకబడి ఉండాలి. దాని ఆర్థిక పరిస్థితులు లాభసాటిగా ఉండవు. అంటే దాని బడ్జెట్ మరియు ఆర్థిక అవసరాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయి ఉండాలి. ఇది వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతంలో గణనీయమైన గిరిజన జనాభాను కలిగి ఉండాలి. 

ప్రత్యేక హోదా ప్రయోజనాలు ఏమిటి?

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక సాయం అందుతుంది. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ఆధారంగా ఇలాంటి రాష్ట్రాలు మొత్తం కేంద్ర సహాయంలో 30% గ్రాంట్లను పొందుతాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు అనుకూలమైన నిధుల నిష్పత్తి వల్ల కూడా వారు ప్రయోజనం పొందుతారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చులను భరిస్తుంది. రాష్ట్రం 10% మాత్రమే భరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా జనరల్ కేటగిరీలోని రాష్ట్రాలు 40 శాతం వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది.

ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు తక్కువ పన్ను రేట్లు కలిగి ఉంటాయి. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు, ఇన్‌కమ్ టాక్స్, కార్పొరేట్ పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవేకాకుండా అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.

బీహార్‌కు ప్రత్యేక హోదా ఎందుకు కావాలి?

2000 సంవత్సరంలో రాష్ట్ర విభజనతో తీవ్రరూపం దాల్చిన బీహార్ కు పరిమిత సహజ వనరులు మిగిలిపోవడంతో నిరంతర పేదరికం, అనావృద్ధి కారణంగా ప్రత్యేక హోదా కోరుతోంది. రాష్ట్రంలో సాగునీరు అందకపోవడం, ఉత్తరాదిన తరచూ వరదలు రావడం, దక్షిణాదిన తీవ్ర కరువు పరిస్థితులు నెలనడం నిత్యకృత్యమైంది. బీహార్ తలసరి జిడిపి సుమారు రూ. 54,000, ఇది భారతదేశంలో అత్యల్పంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు కావాలి?

ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోవడంతో నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారీగా ఆదాయం కోల్పోయింది. రాష్ట్రానికి రాజధాని నిర్మించాల్సి ఉండడం, పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్షించాల్సి రావడం, అలాగే పన్ను రాయితీలు, అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలతో రాష్ట్ర అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందన్న ఆశతో 2014 నుంచి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తుందా?

2014లో రాష్ట్రంలో గద్దెనెక్కిన టీడీపీ కేంద్రంలో కూడా బీజేపీతో అధికారం పంచుకుంది. ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టిన టీడీపీ చివరకు అదే డిమాండ్‌తో ఎన్డీయే నుంచి వైదొలిగింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష పార్టీ  ఎంపీలు ఐదుగురు ప్రత్యేక హోదా డిమాండ్‌తో తమ పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు తమకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని ప్రచారం చేసిన వైఎస్సార్‌సీపీ.. అధికారంలోకి వచ్చినా దానిని సాధించలేకపోయింది. ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున తమ అవసరం అక్కడ రాలేదని, అందుకే తమ డిమాండ్లు నెరవేర్చుకునే సామర్థ్యం లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ చెబుతూ కేవలం విన్నపాలకు పరిమితమైంది. 

ఇప్పుడు టీడీపీ ఘన విజయం సాధించింది. కేంద్రంలోనూ అధికారం పంచుకుంటుంది. ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల అవసరం కూడా ఉంది. అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని ఎన్డీయే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Whats_app_banner