Nitish Kumar promise on Special status: `అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా`
Nitish Kumar promise on Special status: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ యేతర విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వెనుబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.
Nitish Kumar promise on Special status: ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోని బీజేపీయేతర విపక్ష కూటమి తరఫున బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ హామీలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. కేంద్రంలో తమ కూటమి అధికారంలోకి వస్తే, బిహార్ సహా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
Nitish Kumar promise on Special status: కూటమి రూపురేఖలేంటి?
బిహార్ కు ఎన్డీయే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, మోసం చేసిందని నితీశ్ కుమార్ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేసే దిశగా నితీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న విషయ తెలిసిందే. అయితే, ఆ కూటమి రూపు రేఖలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కూటమిలో చేరనున్న పార్టీలేంటి? ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ కూటమిలో చేరుతుందా? లాంటి ప్రశ్నలకు ఇంకా జవాబుల్లేవు.
Nitish Kumar promise on Special status: ప్రత్యేక హోదా
ఎన్డీయేయేతర పార్టీలు 2024లో ఒకే కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆ కూటమి ముఖ్య నేతల్లో ఒకరైన నితీశ్ కుమార్ కీలక హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే, దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించకూడదనే దానికి సరైన కారణమే లేదన్నారు. విపక్ష కూటమిలోకి సాధ్యమైనన్ని పార్టీలను తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
Nitish Kumar promise on Special status: తేజస్వీ యాదవ్ తో కలిసి..
బిహార్ లోని 8 వేల పై చిలుకు గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల కోసం సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే కార్యక్రమంలో నితీశ్ కుమార్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రచారంపైనే ఆధారపడుతోందని, ప్రజా ప్రయోజనాల కోసం ఏ పనీ చేయడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పించి ఉంటే, బిహార్ తో పాటు అనేక వెనుకబడిన రాష్ట్రాలు అనేక రంగాల్లో ముందడుగు వేసేవని వ్యాఖ్యానించారు. కేంద్రం 2019లో ప్రారంభించిన ప్రతీ ఇంటికి నీరు అందించే `హర్ ఘర్ జల్` పథకం నిజానికి అప్పటికే బిహార్ లో అమలవుతున్న పథకమేనన్నారు.