Ysrcp MP Golla Baburao : ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి - రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు-delhi ysrcp mp golla baburao demands central govt grants special category status to ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Mp Golla Baburao : ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి - రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు

Ysrcp MP Golla Baburao : ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి - రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు

Bandaru Satyaprasad HT Telugu
Jun 29, 2024 05:16 PM IST

Ysrcp MP Golla Baburao : రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి - రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు కేటాయించాలి - రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు

Ysrcp MP Golla Baburao : ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనకు వైసీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అన్నారు. శనివారం రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ చర్చ ప్రారంభిచారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఏపీకి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కు తగ్గిన గనులను కేటాయించాలన్నారు.

తొలి దళిత సభ్యుడిని

ఆంధ్ర ప్రదేశ్ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎంపికైన సభ్యుడినని గొల్ల సుబ్బారావు తనను పరిచయం చేసుకున్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను రాజ్యసభలో అడుగుపెట్టానన్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటి దళిత సభ్యుడిని తానేనన్నారు. ఏపీలోని మొత్తం దళిత సమాజం తరఫున తాను పోరాడతానన్నారు. ద్రౌపది ముర్ము ఓ గిరిజన మహిళ, వాస్తవంగా ఆమెకు కోసం ఇల్లు కూడా లేదని, అలాంటి ఆమెకు భారత రాష్ట్రపతి పదవి దక్కడం అభినందనీయమన్నారు. ఇందుకు బీజేపీని అభినందిస్తానన్నారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించారని, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందన్నారు. నిజానికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహిళలకు సమానత్వం కల్పించాలని కోరారన్నారు. అందుకే 1950లలో హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని కానీ కొన్ని సమస్యల కారణంగా ఆ బిల్లు పాస్ కాలేదన్నారు. కానీ అంబేడ్కర్ కోరికను ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు.

పదేళ్లలో కీలక నిర్ణయాలు

బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని ఎంపీ గొల్ల బాబూరావు అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినందుకు దేశపౌరుడిగా తాను గర్విస్తున్నానన్నారు. తాను 25 ఏళ్లు ఏపీలో ప్రభుత్వ అధికారిగా పనిచేశానన్నారు. ఏపీ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించిన పారిశ్రామిక రంగం, స్టార్టప్ రంగం, వ్యవసాయ రంగం, సామాజిక రంగాలు భారత్‌ అభివృద్ధి నిదర్శనం అన్నారు. వీక్షిత్ భారత్ అనేది చాలా ముఖ్యమైన నినాదం అని, అది కేవలం బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే కాదని యావత్ దేశానికి నినాదం అన్నారు. సామాజిక , ఆర్థిక , పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. దేశంలో ఇంకా ఇరవై ఐదు కోట్ల మంది పేదలు ఉన్నారని, పేదరికం నుంచి భారత్ ను బయటకు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దేశంలో యువత కోసం ఒక్క కార్యక్రమం కూడా లేదని, యువత కోసం పథకాలు రూపొందించాలని బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒకవైపు ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధి పథకాలను తీసుకురావాలన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత కోసం పథకాలు అమలుచేయాలన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

"2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ ను విభజించారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాజ్యసభ అంగీకరించింది. పదేళ్లు గడిచినా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. భారత ప్రభుత్వం పునరాలోచించి ఏపీకి ప్రత్యేక హోదాను మంజూరు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామిగా ఉంది. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి."- రాజ్యసభ ఎంపీ, గొల్ల బాబూరావు

Whats_app_banner

సంబంధిత కథనం