Nandyala : నంద్యాలలో మోసం.. వైద్యుడిని బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. రూ.38 లక్షలు కొట్టేసిన మోసగాళ్లు
Nandyala : నంద్యాలలో ఓ వైద్యుడిని సైబర్ మోసగాళ్లు బురిడి కొట్టించారు. మీపై కేసులున్నాయని, వాటి నుంచి మిమ్మల్ని తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. ఏకంగా రూ.38 లక్షలు కొట్టేశారు. మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు.. నంద్యాల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని రాహుల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ రామయ్యకు.. రెండు రోజుల కిందట సైబర్ మోసగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ ఆన్సర్ చేసిన రామయ్యకు.. తాము సీబీఐ అధికారులమని, సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. దీంతో కంగారు పడ్డ డాక్టర్ రామయ్య.. చెప్పండి సార్ అంటూ మాట్లాడారు.
మీ సెల్ నంబర్ ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందని.. దీనిపై ఢిల్లీ పోలీస్‌స్టేషన్‌లో హ్యూమన్ ట్రేడింగ్, మనీలాండరింగ్, చీటింగ్ కేసులు నమోదు అయ్యాయని భయపెట్టారు. కేసులున్నాయని మోసగాళ్లు చెప్పేసరికి.. బెదిరిపోయిన డాక్టర్ రామయ్య భయపడుతూ.. మళ్లీ చెప్పండి సార్ అన్నారు. ఆన్‌లైన్ విచారణ జరుపుతామని.. డిజిటల్ అరెస్టు చేశామని బెదిరించారు.
రూ.38 లక్షలు పంపితే కేసుల నుంచి తప్పిస్తామని.. లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు డాక్టర్ రూ.38 లక్షలు పంపించారు. అలాగే అరగంట సేపు డాక్టర్‌ను కాల్‌లో ఉంచి.. ఆయన బ్యాంక్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. తరువాత మోసపోయానని తెలుసుకున్న డాక్టర్.. టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇస్మాయిల్ వివరించారు.
కర్నూలు జిల్లాలో పైసా వసూల్..
తాము ఆర్టీవో అధికారులమని చెప్పి.. వాహనదారుల వద్ద పైసా వసూల్‌కు పాల్పడ్డారు ఇద్దరు కేటుగాళ్లు. ఈ ఘటన ఆదోని పట్టణంలో గురువారం వెలుగు చూసింది. అదోని పట్టణం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. నకిలీ ఆర్టీవో అధికారుల అవతారమెత్తారు. పట్టణంలోని ఆకాశవంతెన సమీపంలో ఈనెల 8న వాహనాలను ఆపుతూ పత్రాలు చూపించాలని.. సరిగా లేవని డబ్బులు వసూలు చేశారు. ఓ వాహనానికి పత్రాలు సరిగా లేవని, రూ.లక్ష ఇస్తే వదిలేస్తామని, లేదంటే సీజ్ చేస్తామని వాహన జయమానిని బెదిరించారు.
అంతటితో ఆగకుండా వాహనం డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన ఓ పోలీసు అధికారి సీసీ కెమెరాల సాయంతో కేటుగాళ్లు ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఆలూరు ప్రాంతాంలోనూ వాహనదారుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)