Gandhi Hospital Jr Doctor Attacked : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి జరిగింది. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి దాడి చేశాడు. పక్క నుంచి వెళ్తున్న జూ.డాక్టర్ అప్రాన్ లాగి, దాడికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి ఆమెను ఇతర సిబ్బంది కాపాడారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన జూ.డాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అతడు ఎందుకు దాడి చేశాడో తెలియాల్సి ఉంది.
మహిళా వైద్యురాలిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి మరో మహిళ చేయి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. డాక్టర్ మరో రోగిని చూసేందుకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా అతడి చేతిని తాకినట్లుగా సీసీటీవీ కెమెరాలో కనిపిస్తోంది. ఇంతలో అతడు డాక్టర్ అప్రాన్ లాగుతూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో డాక్టర్ అప్రాన్ చిరిగిపోయింది. వెంకటే పక్కనున్న డాక్టర్లు, సిబ్బంది అతడి పక్కకు లాగారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి బన్సీలాల్‌పేటకు చెందిన ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం అతడిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అతడు ఇలా ప్రవర్తించాడా? మానసిక స్థితి సరిగా లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
ఇటీవల కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. తమకు భద్రత కరవైందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో గాంధీ ఆసుపత్రి ఘటనతో వైద్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.