Warangal Crime News : 'పుష్ప' స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్ - ఓరుగల్లు పోలీసులకు ఇలా దొరికిపోయారు..!-cannabis being transported secretly in a tractor is seized in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime News : 'పుష్ప' స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్ - ఓరుగల్లు పోలీసులకు ఇలా దొరికిపోయారు..!

Warangal Crime News : 'పుష్ప' స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్ - ఓరుగల్లు పోలీసులకు ఇలా దొరికిపోయారు..!

HT Telugu Desk HT Telugu
Sep 20, 2024 03:18 PM IST

ఒడిశాలోని చితరకొండ ఏరియా నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయిని వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అనంతసాగర్​ క్రాస్​ వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ ట్రాక్టర్ ను తనిఖీ చేయగా…ట్రాలీ కింది భాగంలో గంజాయిని గుర్తించారు.

గంజాయి సీజ్
గంజాయి సీజ్

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్​ కు పాల్పడుతున్న ముఠాకు తెలంగాణ యాంటీ డ్రగ్స్​ టీమ్​ తో పాటు హసన్​ పర్తి పోలీసులు చెక్​ పెట్టారు. ట్రాక్టర్​ కు సీక్రెట్​ ఛాంబర్​ ఏర్పాటు చేసి, గంజాయి తరలిస్తుండగా.. పట్టుకున్నారు. కాగా స్మగ్లింగ్​ కు పురమాయించిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండగా.. ట్రాక్టర్ డ్రైవర్​ మాత్రం పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. వరంగల్ పోలీస్​ కమిషనర్​ అంబర్​ కిషోర్ ఝా అరెస్టుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు.

ఒడిశా టు తెలంగాణ..!

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం పాతకోట ప్రాంతానికి చెందిన కిలో లక్ష్మీనారాయణ అనే 24 ఏళ్ల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్​ గా పని చేసేవాడు. కాగా అతడికి బంధువు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కిలో నారాయణ గంజాయి స్మగ్లింగ్​ చేసేవాడు. ఒడిశా రాష్ట్రం చితరకొండ మండలంలో కొంతమంది వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, అక్కడి నుంచి ఎక్కువ ధరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేసేవాడు. 

ఇందులో భాగంగానే నారాయణ ఈ నెల 17వ తేదీన చితరకొండకు చెందిన నలుగురు వ్యక్తుల నుంచి సుమారు 338 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దాని విలువ రూ.85 లక్షలకుపైగానే ఉండగా.. ఆ మొత్తం సరకును 96 ప్యాకెట్లుగా మార్చాడు.

ట్రాక్టర్​ కింద సీక్రెట్​ ఛాంబర్​

చితరకొండ ఏరియా నుంచి తెలంగాణలోని సిద్దిపేటకు గంజాయిని చేర వేసేందుకు నారాయణ పథకం రచించాడు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్​ గా పని చేస్తున్న తన బంధువు లక్ష్మీనారాయణకు విషయం చెప్పాడు. అనంతరం లక్ష్మీ నారాయణకు చెందిన ట్రాక్టర్​ కు తమ పథకంలో భాగంగా సీక్రెట్​ ఛాంబర్​ ఏర్పాటు చేశారు. పుష్ప సినిమాలో స్మగింగ్​ చేసినట్టుగానే ట్రాక్టర్​ ట్రాలీ కింది భాగంలో ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్​ ఛాంబర్​ ను ఏర్పాటు చేసుకుని, అందులో 96 ప్యాకెట్లలోని 336 కిలోల గంజాయిని వరుసగా పేర్చారు. అనంతరం ధారకొండ నుంచి కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి చేరవేసేందుకు ప్లాన్​ వేశారు.

గుట్టురట్టు చేసిన పోలీసులు

గంజాయిని సీక్రెట్​ ఛాంబర్​ లో పేర్చిన అనంతరం ధారకొండ నుంచి భద్రాచలం, ములుగు, హనుమకొండ, సిద్దిపేట మీదుగా బిక్కనూరుకు చేరవేసేందుకు దుండగులు రూట్​ మ్యాప్​ తయారు చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ సిటీ మీదుగా సిద్దిపేట వైపు గంజాయి ట్రాక్టర్​ వెళ్తున్నట్టు తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్​ టీమ్​లోని అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే హసన్​ పర్తి పోలీసుల సహాయంతో ఎన్​హెచ్​–563 పై హసన్​ పర్తి పీఎస్​ పరిధిలోని అనంతసాగర్​ క్రాస్​ వద్ద శుక్రవారం ఉదయం వాహనాల తనిఖీ నిర్వహించారు.

అంతలోనే అక్కడికి చేరుకున్న గంజాయి ట్రాక్టర్​ ను పట్టుకుని సోదా చేశారు. మొదట ట్రాక్టర్​ ట్రాలీలో ఏమీ లేదని గుర్తించిన అధికారులు.. ఆ తరువాత ట్రాలీ కింది భాగంలో ఉన్న సీక్రెట్​ ఛాంబర్​ చూసి షాక్​ అయ్యారు. అనంతరం ట్రాక్టర్​ ట్రాలీ జాకీ లేపి చూసి అవాక్కయ్యారు. అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి, నిందితుడు, ట్రాక్టర్ డ్రైవర్​ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. 

అతడిని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం ట్రాలీ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి తీసుకురమ్మని చెప్పిన నారాయణతో పాటు సరుకును అందజేసిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ , తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం సీఐ సురేష్ , హసన్ పర్తి సీఐ చేరాలు, ఎస్ ఐలు దేవేందర్ రెడ్డి, రవి ఇతర సిబ్బందిని వరంగల్ సీపీ అంబర్​ కిషోర్​ ఝా అభినందించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టింగ్ - వరంగల్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.