Ganja in Kakinada: గంజాయి అక్రమ రవాణా.. ఇద్దరు బాలికలు అరెస్టు.. రెండు బ్యాగుల్లో 30 కిలోలు!
Ganja in Kakinada: కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణ చేస్తున్న ఇద్దరు బాలికలు అరెస్టు అయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గంజాయి తరలింపు కేసులో బాలికలు ఉండటంతో చర్చానీయాంశం అయింది. పోలీసులు కేసు నమోదు చేసి.. వారిని జువైనల్ హోంకు తరలించారు.
కాకినాడ జిల్లా గోకవరం మండలంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలికలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో.. గోకవరం ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు బ్యాగుల్లో సుమారు రూ.1.53 లక్షల విలువైన 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ బాలికలు ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరికి చెందిన వారిగా గుర్తించారు. ఒడిశాలోని జోగ్బే వద్ద గంజాయి కొనుగోలు చేసి.. హర్యానాకు చెందిన రేణుకకు సరఫరా చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ.నరసింహ కిశోర్ వివరించారు. పట్టుబడిన ఇద్దరూ చదువుకుంటున్నారని, ఇద్దరు మైనర్లు కాబట్టి వారిని రాజమహేంద్రవరంలోని జువైనల్ హోంకు తరలించామని ఎస్పీ చెప్పారు.
గంజాయి కొనుగోలు, తరలింపు చైన్‌ను కనిపెట్టి.. వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి వ్యాపారం చేసే వారు బాగానే ఉంటున్నారని.. డబ్బులకు ఆశపడి ఒక చోట నుంచి మరొక చోటకు తరలించే కూలీలపై చర్యలు ఉంటున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమాయక బాలురు, బాలికలు గంజాయి కేసుల్లో ఇరుక్కుంటున్నారని, వ్యాపారులపై ఎటువంటి చర్యలు ఉండట్లేదనే విమర్శలు ఉన్నాయి.
కీచక ఉపాధ్యాయుడు.. ప్రైవేట్ భాగాలను తాకుతూ..
సభ్య సమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం హైస్కూల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్.మల్లవరం హైస్కూల్‌లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న రవి.. ఇటీవలి పదో తరగతి విద్యార్థినులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు.
తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ కలుగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పి పంపారు.
అయితే.. అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై ఉపాధ్యాయుడు రవి కక్ష పెట్టుకున్నాడు. తన క్లాసులకు రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపేవాడు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళనకు విద్యార్థినులు లోనైయ్యారు. ఇది ఇతర విద్యార్థినీ, విద్యార్థులకు కోపం తెప్పించింది. ఉపాధ్యాయుడు రవిపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)