TG Teacher Transfer : ప్లీజ్ టీచర్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు-telangana model school teachers were transferred and students cried in mahabubnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Teacher Transfer : ప్లీజ్ టీచర్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు

TG Teacher Transfer : ప్లీజ్ టీచర్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు

Basani Shiva Kumar HT Telugu
Sep 15, 2024 10:16 AM IST

TG Teacher Transfer : ఆదర్శ పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్ల కోరిక నెరవేరబోతోంది. దాదాపు మూడువేల మంది టీచర్లు బదిలీ కానున్నారు. ఉద్యోగాల్లో చేరిన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ప్రక్రియ మొదలవుతోంది. అయితే టీచర్లు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు ఏడుస్తున్నారు.

మహబూబ్ నగర్ మోడల్ స్కూల్‌లో ఏడుస్తున్న విద్యార్థులు, టీచర్
మహబూబ్ నగర్ మోడల్ స్కూల్‌లో ఏడుస్తున్న విద్యార్థులు, టీచర్

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల బదిలీకు రేవంత్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. విద్యార్థులు మాత్రం బాధపడుతున్నారు. 12 ఏళ్లుగా తమకు చదువు చెప్పిన గురువులు వెళ్తుంటే.. ఏడుస్తున్నారు. 'మమ్మల్ని వదిలి వెళ్లకండి టీచర్' అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో 12 ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నారనే విషయం పిల్లలకు తెలిసింది. దీంతో 'మమ్మల్ని వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి' అంటూ విద్యార్థులు ఉపాధ్యాయులను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నారు.

తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సిద్ధంచక ముందు 2013లో.. మరోసారి 2014లో రెండు విడతల్లో నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి వారు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా బదిలీలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గతేడాది జులైలో బదిలీలకు షెడ్యూల్‌ జారీచేసింది. వారంతా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సర్వీస్‌ పాయింట్ల కేటాయింపుపై కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితంగా బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

సుదీర్ఘ వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. 2013, 2014లో చేరినా.. మెరిట్‌ ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేసి బదిలీలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో చేరిన తేదీ ఆధారంగా ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు కేటాయించాలని చెప్పింది. ఇటు న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

తెలంగాణలోని పాత జోన్లు (5, 6) ప్రకారమే బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్‌ను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని బదిలీ చేయనున్నారు. పీజీటీ, టీజీటీలకు జోన్‌ యూనిట్‌గా బదిలీలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము బదిలీల కోసం ఎదురుచూశామని.. తమ డిమాండ్‌ను నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.