TG HC On HYDRA : నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చారు..? హైడ్రాపై హైకోర్టు ప్రశ్నలు-petition filed in high court against hydra court directed the government to respond to a writ petition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Hc On Hydra : నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చారు..? హైడ్రాపై హైకోర్టు ప్రశ్నలు

TG HC On HYDRA : నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చారు..? హైడ్రాపై హైకోర్టు ప్రశ్నలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 14, 2024 07:36 AM IST

హైడ్రా తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. హైడ్రా అధికారాలపై లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు

హైడ్రా అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా... వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది.

హైడ్రా అధికారాలు, కూల్చివేతలను సవాల్ చేస్తూ నానక్ రామ్ గూడకు చెందిన లక్ష్మి అనే మహిళ పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ...ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమీన్‌పూర్‌ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 3న వ్యవసాయక్షేత్రంలోని షెడ్లు కూల్చివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ నేలమట్టం చేశారని ప్రస్తావించారు.

ఈ జీవో ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారాలను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు. 119/21, 1199/22 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో హైడ్రా జోక్యాన్ని నిరోధిస్తూ స్టే ఆదేశాలివ్వాలని కోరారు. ఇందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

హైకోర్టు ధర్మానసం స్పందిస్తూ... నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్యలు తీసుకునే ముందే... ఆస్తి పత్రాలతో పాటు అధికారుల అనుమతులను పరిశీలించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 30, 2024న జరగనుంది.

ఇటీవలే హైడ్రా నివేదిక :

మరోవైపు అక్రమ నిర్మాణలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ నిర్మాలను కూల్చేవేసింది. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన పనులపై ప్రభుత్వానికి హైడ్రా ఓ నివేదికను సమర్పించింది. ఇందులో హైడ్రా చేపట్టిన వివరాలను పేర్కొంది.

మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. జూన్ 27 నుంచి పలు నిర్మాణాలను తొలగించినట్లు వివరించింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు కూల్చగా… రాజేంద్రనగర్‌ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను తొలగించినట్లు ప్రస్తావించింది.

ఇక నగరంలో కూల్చివేతలతో పాటు ఇళ్లు, ఫ్లాట్లు కొనేవారికి ఇటీవలే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన లుచేశారు. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని… కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని పేర్కొన్నారు.

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు.