Telangana Flood Damage : తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు - కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy said that telangana has suffered a loss of rs 10320 crores due to floods ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Flood Damage : తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు - కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

Telangana Flood Damage : తెలంగాణలో వరద నష్టం రూ.10,320 కోట్లు - కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 13, 2024 09:02 PM IST

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. శుక్రవారం కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో సీఎం కీలక అంశాలను వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. 

రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. 

తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెర్వులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు.

కేంద్ర బృందంతో సమావేశం….

రాష్ట్రంలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహదారు వేం నరేందర్​ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలను సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. ఇండ్ల నిర్మాణాలకు అవసరమైన సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, హీట్ వేవ్​ లాంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లపై ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.

మేడారం అటవీ ఘటనపై చర్చ…

మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. 

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు బృందాలుగా విడివడి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది.