Medaram Jathara 2024 : మేడారం వెళ్లే భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్ - అటవీశాఖ రుసుం నిలిపివేత-telangana govt announced an exemption from forest department fees for devotees coming to medaram jathara 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jathara 2024 : మేడారం వెళ్లే భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్ - అటవీశాఖ రుసుం నిలిపివేత

Medaram Jathara 2024 : మేడారం వెళ్లే భక్తులకు సర్కార్ గుడ్ న్యూస్ - అటవీశాఖ రుసుం నిలిపివేత

Medaram Jathara 2024 Updates: మేడారం వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ అటవీ శాఖ. ఏటూరు నాగారం అభయారణ్యం అటవీశాఖ రుసుము నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు.

మేడారం (Twitter)

Medaram Jathara 2024 Updates: త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి కొండా సురేఖ. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.

మంత్రి ఆదేశాలతో… ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు పర్యావరణ రుసుము (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారం నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్లిక్ ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తోంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీశాఖ కోరింది.

వరంగల్‌ నుంచి మేడారం వెళ్లేవారి నుంచి వారి వాహన స్థాయిని బట్టి ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌ వద్ద జాతీయ రహదారిలో రూ.100 నుంచి రూ.200 వరకు టోల్ వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా… అక్కడి నుంచి తాడ్వాయి లేదా పస్రా వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మేడారంలో పంచాయతీ సిబ్బంది పార్కింగ్‌ ఛార్జీ వసూలు చేస్తున్నారు. వరంగల్‌ నుంచి వచ్చేవారు ఈ మూడుచోట్ల ఇలా రుసుములు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ వసూలు చేస్తున్న రుసుముపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.