CM Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి - లేకపోతే హైడ్రా నేలమట్టం చేస్తుంది’ - సీఎం రేవంత్ వార్నింగ్-cm revanth reddy warning to encroachers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి - లేకపోతే హైడ్రా నేలమట్టం చేస్తుంది’ - సీఎం రేవంత్ వార్నింగ్

CM Revanth Reddy : ‘కబ్జా చేస్తే మీరే ఖాళీ చేసి వెళ్లిపోండి - లేకపోతే హైడ్రా నేలమట్టం చేస్తుంది’ - సీఎం రేవంత్ వార్నింగ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 11, 2024 12:07 PM IST

చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టమని పునరుద్ఘాటించారు. కబ్జా చేసిన వాళ్లు వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

చెరువులు, నాలాలు, కుంటల్లో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు నిర్మాణాలను కూల్చివేయగా… మరికొన్ని నిర్మాణాలపై నోటీసులు జారీ చేసింది. ఎంతటివారైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కబ్జా చేస్తే వదిలిపెట్టం - సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటే తాజాగా కబ్జాదారులను మరోసారి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చెరువులు, కుంటలను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్…. 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామని ప్రకటించారు. పబ్లిక్ సర్వీక్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్న ఆయన.... పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా చెరువుల కబ్జాలపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి… కబ్జా చేసిన వాళ్లు వారికి వారుగా ఖాళీ చేసి వెళ్లిపోవాలన్నారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగుతుందని… నిర్మాణాలన్నింటిని నేలమట్టం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయాల్లోకి కలుపుతున్నారని చెప్పారు. చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులు ఎంతటివరైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన... ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు.

గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఎస్ఐ అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదన్న ఆయన.... ఒక భావోద్వేగమని చెప్పుకొచ్చారు. ఏ సమస్య వచ్చినా బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామన్నారు. 27 రోజుల్లో 22,22,687 మంది రైతులకు 18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.

కొనసాగుతున్న విరాళాలు:

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ నిర్మాత దిల్ రాజు 25 లక్షలు, నిర్మాత సూర్యదేవర నాగవంశి 25 లక్షల రూపాయలు విరాళ చెక్కులను ముఖ్యమంత్రిని  కలిసి చెక్కులను అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి… వారందరినీ అభినందించారు.

 

Whats_app_banner