CM Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి-hyderabad cm revanth reddy reviews on tgsrtc orders as per need purchase new buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Sep 10, 2024 08:29 PM IST

CM Revanth Reddy : టీజీఎస్ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నించాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకూ 83.42 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారన్నారు.

అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి
అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ఇందుకు ప్రతిపాదిక చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. టీజీఎస్ఆర్టీసీపై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వహించారు. మ‌హాల‌క్ష్మి ప‌థకం మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై సీఎం ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా ఉంద‌ని, ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేశార‌ని, ఇందుకు సంబంధించి మ‌హిళా ప్రయాణికుల‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయ‌ని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు.

7292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం

ఆర్టీసీలో 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివ‌రించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం ప్రారంభ‌మైన త‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంద‌ని, అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ముఖ్యమంత్రికి అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్ లో చూపారు. అనంత‌రం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు త‌దిత‌రాలకు క‌లిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివ‌రించారు.

అప్పుల రీకన్ స్ట్రక్చన్ పై అధ్యయనం

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని.. వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్చన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణ‌భారం త‌గ్గించాల‌ని ఆయ‌న సూచించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌గ‌డంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబ‌ర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వ‌స్తోంద‌ని అధికారులు తెలిపారు. స‌మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, సీఎం కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్ రాజ్‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత కథనం