Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… వాటిపై ప్రజా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.హైదరాబాద్ లో హైడ్రా కంటే ముందే కరీంనగర్ లో భూ కబ్జాలు,అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాటిపై తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా కంటే ముందే కరీంనగర్ లో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఎక్కడైనా భూ కబ్జా, అక్రమ నిర్మాణాలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు స్పందించకుంటే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల సంరక్షణ, సామాన్యుడికి అండగా తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే చర్యల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ చాత్వాల బాజ్ పాయ్ తో కలిసి ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్ వేసిన యోగాసనాలు చూసి విద్యార్థులను అభినందించారు. స్పోర్ట్స్ స్కూల్ లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు పిడి యాక్ట్ అమలు
యువతను పెడదారి పట్టించే గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తుందన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)