Rythu Runa Mafi : బీఆర్ఎస్ పాప ప్రక్షాళన పూజలు.. కాంగ్రెస్ 'శుద్ధి' కార్యక్రమం! యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం-politics at the center of yadagirigutta on telangana loan waiver ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi : బీఆర్ఎస్ పాప ప్రక్షాళన పూజలు.. కాంగ్రెస్ 'శుద్ధి' కార్యక్రమం! యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం

Rythu Runa Mafi : బీఆర్ఎస్ పాప ప్రక్షాళన పూజలు.. కాంగ్రెస్ 'శుద్ధి' కార్యక్రమం! యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 09:26 PM IST

యాదాద్రి కేంద్రంగా రుణమాఫీపై రాజకీయ రగడ మొదలైంది. మాజీ మంత్రి హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజల నిర్వహించగా.. ఇందుకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్… శుద్ది కార్యక్రమం చేపట్టారు. వాటర్ ట్యాంకర్లతో మాఢ వీధులను క్లీన్ చేయించారు.

యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం
యాదాద్రి కేంద్రంగా 'రుణమాఫీ' రాజకీయం

యాదగిరిగుట్ట దేవాలయం ఇపుడు ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల రుణాలను మాఫీ చేస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నారు. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆ ఒట్టును గట్టున పెట్టారని, రైతుల రుణమాఫీ పూర్తిగా చేయకుండానే అబద్దాలు ఆడి రైతులను మోసం చేశారని, ఆయనను క్షమించమని ఈరోజు (గురువారం) యాదగిరీశుడిని వేడుకున్నానని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని, రుణమాఫీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కేడర్ మండిపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరి గుట్ట దేవాలయాన్ని అపవిత్రం చేశారని పేర్కొంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలను వెంట తీసుకుని అయిదు ట్యాంకర్ల నీటితో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం చర్చనీయాంశం అయ్యింది.

మరో వైపు యాదగిరి గుట్ట మాడ వీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేసిన ఉదంతంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆలయన ఈవో భాస్కర రావు నివేదిక పంపండంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎండోమెంట్ యాక్ట్ , సెక్షన్ 7 ప్రకారం చట్టపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉన్నట్లు టెంపులు అధికార వర్గాలు తెలిపాయి.

వివాదమేంటి..?

తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షలోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిపై సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు పెడుతున్నట్లు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్ రావు ప్రతి సవాలు చేశారు. రుణ మాఫీ ని ప్రభుత్వం మూడు విడతల్లో పూర్తి చేసింది. మూడో విడతలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేసినట్లు, తామిచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించారు. అయితే, వివిధ సాంకేతిక కారణాలవల్ల అర్హులనైన రైతులందరికీ రుణ మాఫీ జరగలేదు. రుణమాపీ పూర్తిగా జరగ పోవడానికి, పలువురు రైతులకు వర్తించక పోవడానికి 31 కారణాలను వ్యవసాయ శాఖ గుర్తించి వాటిని సరిదిద్ది, రుణమాఫీని పూర్తి చేసే పనిలో ఉంది.

బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు

మూడు విడతల్లో తమకు రుణ మాఫీ జరగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లెక్కారు. ధర్నాలకు దిగారు. వ్యవసాయ శాఖ కార్యలయాలు, బ్యాంకులకు పోటెత్తారు. రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని వారికి తాము అండగా ఉన్నామంటూ ఈ రోజు (గురువారం 22వ తేదీ) బీఆర్ఎస్ ధర్నా ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పి, యాదగిరీశునిపై వేసిన ఒట్టును సీఎం పక్కన పెట్టి పాపం మూటగట్టుకున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరి గుట్టలో పూజలు చేసి, ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ధర్నాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలను క్షమించాలని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నట్లు ప్రకటించారు.

వివాదాస్పదంగా మారిన హరీష్ రావు పర్యటన..!

మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి యాదగిరి గుట్ట మాడ వీధుల్లో పాప ప్రక్షాళన పూజలు జరిపించారు. ఇది ఎండోమెంట్ యాక్ట్ లోని సెక్షన్ 7 ప్రకారం నేరంగా పరిగణిస్తామని టెంపుల్ అధికారులు చెబుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై విరుచుకుపడ్డారు.

‘ చరిత్రలో ఎవరూ చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రుణాలు మాఫీ చేస్తే.. బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని, బీఆర్ఎస్ నేతల పర్యటనతో యాదాద్రి ఆలయం అపవితం అయ్యింది..’ అని పేర్కొన్న ఎమ్మెల్యే అయిలయ్య యాదవ్ కార్యకర్తలతో కలిసి శుద్ది కార్యక్రమం చేపట్టారు.

మాడ వీధుల్లో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పూజలు చేసిన హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, హరీష్ రావుతో పాటు ఉన్న ఇతర నాయకుల, పేరు తెలియని పూజారిపై ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఎండోమెంట్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం.

( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టెమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )