Hydra Cases : హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు
Hydra Cases : అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా.. ముగ్గురిపై కేసు నమోదు చేసింది. హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారని వారిపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ నెల 8న మాదాపూర్ సున్నంచెరువులో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది. ఈ సమయంలో.. హైడ్రా కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని.. వెంకటేష్, లక్ష్మి, సురేష్‌పై కేసు నమోదు చేశారు.
అవి కూల్చబోం..
హైడ్రా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మించి నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయబోమని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.
కాటసాని.. లేడీ డాన్‌పై కేసు..
అమీన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్‌పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కేసు నమోదు చేశారు. ఇటీవల కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. లేడీ డాన్ విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు చేశారు. మల్లంపేట చెరువులో విజయలక్ష్మి విల్లాలు నిర్మించినందుకు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
జయభేరికి..
సినీ నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలి పరిధిలోని రంగళాల్ కుంట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చింది. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసులపై మురళీ మోహన్ స్పందించారు. అక్రమ కట్టడాలు ఉంటే తామే కూల్చేస్తామని స్పష్టం చేశారు.
కనీస సమయం ఇవ్వడం లేదు..
అయితే.. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి హైడ్రా నోటీసులు ఇచ్చి.. సమయం ఇస్తోందని.. తమలాంటి పేదవారికి ఎందుకు సమయం ఇవ్వడంలేదని సున్నం చెరువు ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు, సినీ నటుడు మురళీ మోహన్‌కు సమయం ఇచ్చి.. తమ ఇళ్లను మాత్రం వెంటనే కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.