HYDRA : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు, రూ.20 లక్షలు డిమాండ్ - వైద్యుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు-a physiotherapy doctor collecting money on the name of hydra has been arrested in sangareddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు, రూ.20 లక్షలు డిమాండ్ - వైద్యుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

HYDRA : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు, రూ.20 లక్షలు డిమాండ్ - వైద్యుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

HT Telugu Desk HT Telugu
Sep 04, 2024 04:48 PM IST

హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన ఓ వైద్యుడిని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రూపేష్ సూచించారు. ఏవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లు..! డాక్టర్ అరెస్ట్
హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లు..! డాక్టర్ అరెస్ట్ (image source unsplash.com)

 హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో తనకు పరిచయం ఉందని… బిల్డర్లను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఫిజియోథెరపీ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బిల్డర్లను బెదిరించాడు. వారి నుండి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. మంగళవారం రూ. 2 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుంటుండగా డికాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్, అమీన్ పూర్ పోలీసులు నిందితున్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి ఎస్పీ రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లాకు చెందిన బండ్ల విప్లవ్ సిన్హా ఏడు సంవత్సరాలుగా అమీన్ పూర్ సాయి విల్లాస్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తూ… ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పని చేస్తున్నాడు. అతడు ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అమీన్పూర్ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలతో పాటు FTL మరియు బఫర్ జోన్ లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించాడు. 

వారిని ఎలాగైనా బెదిరించి వారి వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అతని ఇంటికి సోషల్ వర్కర్ ఆక్టివిస్ట్ అని ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు. అప్పటినుండి చుట్టుపక్కల చెరువులు, కుంటలకు సమీపంలో మరియు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కడుతున్న బిల్డర్ల వద్దకు వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.

రంగనాథ్ తెలుసంటూ......

ఈ క్రమంలో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్.ఎల్.పి.పేరుతో ఒక పెద్ద నిర్మాణ సంస్థ విల్లా నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అక్రమంగా నిర్మిస్తున్నారని… దాని గురించి మాట్లాడాలని బిల్డర్ రాజేందర్ కు విప్లవ్ సిన్హా వాట్స్ ఆప్ కాల్ చేశాడు. అనంతరం విప్లవ్ సిన్హా బిల్డర్ ను కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుసని… అతడితో దిగిన ఫొటోస్ చూపించాడు. 

అమీన్ పుర్ ఏరియాలో ఎలాంటి విషయమైనా రంగనాథ్ తననే అడుగుతాడని చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కూల్చేయకుండా ఉండాలంటే తనకు రూ. 20 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు 16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు డబ్బు ఇవ్వకుంటే పత్రికల్లో ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేయిస్తానని, హైడ్రా కు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. డబ్బులు ఇస్తే పేపర్ లో రాకుండా మరియు హైడ్రా ఏం చేయకుండా చూసుకుంటానని చెప్పాడు. దీంతో బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే మంగళవారం బిల్డర్లు రాజేంద్రనాథ్, మంజునాధ్ రెడ్డి మరొక ఇద్దరితో కలిసి బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వచ్చారు. అతను అడిగిన డబ్బులలో రాజేంద్రనాథ్ రూ. 2 లక్షల అడ్వాన్స్ గా ఇస్తుండగా… డికాయ్ ఆపరేషన్ లో ఉన్న టాస్క్ ఫోర్స్, అమీన్ పూర్ పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు.కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ కు పంపించడం జరిగిందని ఎస్పీ వివరించారు.

ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ఎవరైనా హైడ్రా పేరుతో, బెదిరింపులకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వ్యక్తుల సమాచారాన్ని 8712656777 కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.