Karimnagar: కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు-illegal construction in buffer zone of mote pond in karimnagar districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar: కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు

Karimnagar: కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు

Basani Shiva Kumar HT Telugu
Aug 27, 2024 06:06 AM IST

Karimnagar: బరితెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అచ్చం అలానే ఉంది భూ కబ్జాదారుల యవ్వారం. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే.. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో హైడ్రా హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. జిల్లాలకు విస్తరించాలని జనం కోరుతున్నారు.

కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు
కనుమరుగైన చెరువులు.. ఆగని అక్రమ నిర్మాణాలు

జగిత్యాల మండలం మోతె చెరువు బఫర్ జోన్‌లో అక్రమంగా ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. ఎప్టీఎల్ పరిధిలో మట్టిని తీసి చెరువు స్థలాన్ని కబ్జా చేసే పనిలోపడ్డారు. జేసీబీతో చెరువు మట్టి తీసి.. కబ్జా చేసిన స్థలాన్ని చదును చేస్తుండగా మత్స్యకారులు అడ్డుకున్నారు. రెండు రోజుల నుంచి ఎఫ్టీఎల్ పరిధిలో స్థానిక కౌన్సిలర్.. జేసీబీతో మట్టి పోసి కబ్జా చేస్తున్నారని ఆందోళనకు దిగారు.‌ మట్టి తీసే పనులను అడ్డుకుని చెరువు భూమిని కాపాడాలని పోలీసులకు పిర్యాదు చేశారు. మోతే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో సుమారు 20 ఎకరాల వరకు కబ్జా అయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి.

వందలాది చెరువులు, కుంటలు..

అక్కడ, ఇక్కడ అనే తేడా లేదు. ఎక్కడ చూసినా చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందలాది చెరువులు కుంటలు కనుమరుగయ్యాయి. పట్టించుకునేవారు లేక కబ్జా గురైన చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి.‌ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1008 చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటికి హద్దులు నిర్ణయించకపోవడంతో కబ్జాదారుల కన్నుపడి కనుమరుగైపోతున్నాయి.

70 శాతం కనుమరుగు..

కరీంనగర్ సమీపంలోని గ్రామాల్లో నూటికి 70 శాతం చెరువులు కుంటలు మాయమైపోయాయి. బొమ్మకల్, తీగలగుట్టపల్లి, ఆరపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, చింతకుంట, అలుగునూరు గ్రామాలు భూమాఫియాకు అడ్డాగా మారాయి. ముఖ్యంగా బొమ్మకల్ గ్రామ పరిధిలో 46.21 ఎకరాల్లో ఉన్న జక్కప్ప చెరువు, 28.10 ఎకరాల్లో ఉన్న గోపాల్ చెరువు, 16.10 ఎకరాల్లో ఉన్న నల్లచెరువు, 12 ఎకరాల్లో ఉన్న గోధుమకుంట, 9.10 ఎకరాల్లో ఉన్న రావికుంట కబ్జాకు గురయ్యాయి.

ఎన్నో అక్రమ నిర్మాణాలు..

కరీంనగర్ సమీపంలోని అలుగునూరు మామిడికుంటలో అక్రమ నిర్మాణాలు వెలిచాయి.‌ నగరాన్ని ఆనుకుని ఉన్న బొమకల్ శివారులోని గోపాల్ చెరువు కనుమరుగయింది. చెరువు స్థలంలో రెండు గోదాములు తోపాటు ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని మాలకుంట, ఉడతకుంట, అవుసుల కుంట విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. తీగలగుట్టపల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఊరకుంటలో ఎప్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా చర్యలు మాత్రం శూన్యం.

మాజీ ఎమ్మెల్యే అక్రమణ..

బొమ్మకల్ ప్లై ఓవర్ బ్రిడ్జి పక్కన బిఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే విద్యా సంస్థ ఉంది. ఇక్కడ చెరువు శిఖం భూమిని కబ్జా చేయడమే కాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫిర్యాదులు రావడంతో.. అధికారులు సర్వే చేసి సర్కార్ భూమి ఎక్కడి వరకు ఉంటుందో నిర్ధారించారు. అయినా హద్దులు దాటి మళ్లీ నిర్మాణాలు చేపట్టారు. బీఆర్ఎస్ పాలనలో కబ్జాలు మితిమీరిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల భాగస్వామ్యం..

రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్ల చేతివాటం.. బడా లీడర్ల భరోసాతోనే చెరువులు, కుంటలు కనుమరుగయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమాయకుల ప్లాట్లను కబ్జా పెట్టిన లీడర్లను.. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి జైలుకు పంపారు. కానీ.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పటికైనా హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ కట్టడాలను కూలుస్తున్న హైడ్రా తరహాలోనే.. కరీంనగర్ కోసం కాడ్రాను ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

( రిపోర్టింగ్ -కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు )