Karimnagar DCC : కరీంనగర్ లో డీసీసీ ప్రెసిడెంట్ రేస్- పదవి కోసం ఆకారపు, వెలిచాల పోటాపోటీ
Karimnagar DCC : కరీంనగర్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పదవిపై ఆసక్తికరమైన పోటీ నెలకొంది. పలువురు నేతలు డీసీసీ పదవి ఆశిస్తున్నా...మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం కీలకం కానుంది. అయితే డీసీసీ పగ్గాలు తనకు దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Karimnagar DCC : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై ఆసక్తికరమైన పోటీ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పలువురు అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో పలువురు నేతలు పదవిని ఆశిస్తున్నా ఈ వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయమే కీలకం కానున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఆయన మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన స్థానంలో త్వరలోనే మరొకరిని నియమించే అవకాశం ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవిపై అందరి దృష్టి పడింది. ఎవరికి ఆ పదవి దక్కనున్నదోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల.. బీఆర్ఎస్ మరో రెండు చోట్ల ప్రాతినిధ్యం వహిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాలు కూడా కరీంనగర్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలపై పొన్నం ప్రభాకర్ ముద్ర ఉండటం ఖాయమని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత అనుచరుడైన కవ్వంపల్లి సత్యనారాయణ టీడీపీ హయాం నుంచే సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలంగా కవ్వంపల్లి డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతూ వచ్చారు. మానకొండూరు అసెంబ్లీ ఇన్ ఛార్జిగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ రావడంతో కవ్వంపల్లి ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఏడాదిన్నర క్రితమే సిద్దమైనా ప్రత్యామ్నయ నేత కనిపించక ఆయననే కొనసాగిస్తూ వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దుకుంటూనే జిల్లా పార్టీ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నెట్టుకువచ్చారు. అయితే పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించడం అనివార్యమయ్యింది.
పీసీసీ చీఫ్ మారిన తర్వాత జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరగనుండటంతో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడం తప్పనిసరి అని తేలిపోయింది. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో డీసీసీ చీఫ్ బాధ్యతలు పెద్దగా ఇబ్బందికరం కాకపోవడంతో పలువురు నేతలు పోటీపడుతున్నారు. మరికొందరు సీనియర్ నేతలు డీసీసీ పదవికి బదులు నామినేటెడ్ పదవులను ఆశిస్తూ ముందే తాము పోటీలో లేమంటూ మంత్రి పొన్నం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావు తెరపైకి రాగా మరికొందరు నేతలు కూడా రేసులోకి వచ్చారు. సీనియర్ నేతలు ఆకారపు భాస్కర్ రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా డీసీసీ చీఫ్ బాధ్యతలను ఆశిస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు సన్నిహితులుగా ఉన్నవారే డీసీసీ పీఠం కోసం పోటీపడుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరికి మద్దతునిస్తారోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
ధీమాలో రాజేందర్ రావు
డీసీసీ పగ్గాలు తనకు దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు గట్టి ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సంబంధాలు కలిగి ఉన్న రాజేందర్ రావు తనకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ప్రణాళికబద్ధంగా స్థానిక సంస్థల, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసే బాధ్యత తీసుకోగలుగుతానని ఇప్పటికే ముఖ్య నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన అవసరం ఉందని.. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం సన్నిహితుల వద్ద కూడా వెలిచాల రాజేందర్ రావు తనవంతు ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా గతంలో పని చేసిన రాజేందర్ రావు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి.. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఒకసారి ప్రజారాజ్యం పార్టీ పక్షాన, ఇటీవల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేశారు. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న రాజేందర్ రావు తనకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసేందు కు తనవంతు కృషి చేస్తానని చెబుతుండగా... పలువురు ముఖ్య నేతలు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
అవకాశం కోసం ఆకారపు
డీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ పార్టీ నేత ఆకారపు భాస్కర్ రెడ్డి గట్టి ఆశలు పెట్టుకున్నారు. యువజన కాంగ్రెస్ నుంచి దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తూ వచ్చిన ఆకారపు భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షు నిగా, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా సుదీర్ఘ కాలం గా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పని చేస్తూ వచ్చారు. కుటుంబ సంబంధాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడినా తిరిగి పార్టీలో చేరిన ఆకారపు భాస్కర్ రెడ్డి తనకు అవకాశం ఇస్తే మరింత క్రియాశీలకంగా పని చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తోంది. గతంలో పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూఐ అధ్యక్షునిగా.. ఆకారపు భాస్కర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో అనేక ఉద్యమాలను కలిసి చేపట్టారు. వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన అవకాశాలను పరిశీలించాలని భాస్కర్ రెడ్డి కోరుకుంటున్నారు.
పలువురు మాజీ ఎమ్మెల్యేలు
మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆరపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్ సైతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. తెరచాటుగా పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా అద్యక్ష పదవిపై పలువురు నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా నేతల ఆశిస్సులు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే ఆ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం