Power Plants Enquiry: బిఆర్ఎస్‌కు మెడకు చుట్టుకున్న ఆ మూడు విద్యుత్ నిర్ణయాలు-revanth reddys order for judicial inquiry on brs decisions on setting up of power plants ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Power Plants Enquiry: బిఆర్ఎస్‌కు మెడకు చుట్టుకున్న ఆ మూడు విద్యుత్ నిర్ణయాలు

Power Plants Enquiry: బిఆర్ఎస్‌కు మెడకు చుట్టుకున్న ఆ మూడు విద్యుత్ నిర్ణయాలు

Sarath chandra.B HT Telugu
Dec 21, 2023 01:56 PM IST

Power Plants Enquiry: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విద్యుత్ రంగంలో బిఆర్ఎస్ భారీ అక్రమాలకు పాల్పడిందని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశించారు.

విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం
విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు రేవంత్ రెడ్డి ఆదేశం

Power Plants Enquiry: తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి జగదీష్ కోరడంతో మూడు అంశాలపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం రేవంత్ ప్రకటించారు.

తెలంగాణలో కాలిపోతున్న మోటర్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రజల్లో విద్యుత్ సెంటిమెంట్‌ను నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్ధికంగా వినియోగించుకోవడంపై విచారణ జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చే పేరుతో టెండర్లు లేకుండా చత్తీస్ ఘడ్‌ ప్రభుత్వానికి చెందిన విద్యుత్‌ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వ సంస్థలు ఒప్పందం చేసుకోవడంపై విచారణ జరపాల్సి ఉందన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై ఈఆర్‌సి ముందు తాము ఫిర్యాదు చేస్తే, తమను సభలో మార్షల్స్‌తో బయటకు గెంటించారన్నారు. చత్తీస్‌ఘఢ్‌‌తో ఒప్పందాన్ని తప్పు పట్టినందుకు, విద్యుత్ జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఓ అధికారిని మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేశారని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తిని హోదా తగ్గించి శిక్షించారన్నారు. అతను కూడా ఈఆర్‌సి ఎదుట వాదన వినిపించినా పట్టించుకోకుండా నవంబర్ 3, 2011లో చేసుకున్న ఒప్పంతో రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, వాటిని పెడచెవిన పెట్టారని, ఇవన్నీ విచారణలో బయటకు రావాల్సి ఉందన్నారు. చత్తీస్‌ఘఢ్‌తో చేసుకున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందంపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు.

భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంతో పదివేల కోట్ల నష్టం…

ఇండియా బుల్స్‌ సంస్థ గుజరాత్‌లో 1080 మెగావాట్ల సామర్థ్యంతో గుజరాత్‌లో నిర్మించాల్సిన ప్రాజెక్టును తెలంగాణకు తీసుకొచ్చి భారీ అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. 2011-12లోనే సబ్‌ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులు మూసేని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టమని కేంద్రం ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రైవేట్ కంపెనీలు 2013 తర్వాత నిర్మించే ప్రాజెక్టులను సూపర్‌ క్రిటికల్‌ కు మారాలనే నిబంధనతో ఇండియా బుల్స్ ప్రాజెక్టు చేపట్టలేదని పేర్కొంది.

అప్పటికే ఆ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు పర్చేజ్‌ ఆర్డర్స్‌ ఇచ్చిందని, కాలం చెల్లిన ప్రాజెక్టుగా మారడంతో, ఒప్పందం రద్దుకు విఫలయత్నం చేసిందని చెప్పారు కొనుగోలు ఒప్పందం చేసుకున్నందున బిహెచ్‌ఇఎల్‌ డబ్బులు ఇవ్వలేమని చెప్పిందని, ఎవరితో అయినా ఒప్పందం చేసుకుంటే వారికి సరఫరా చేస్తామని చెబితే ఆ ప్రైవేట్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇది ఇండియా బుల్స్‌ నష్టపోకుండా కాపాడిందన్నారు.

సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీకి కాలం చెల్లిందని, వాటితో కాలుష్యం వస్తుందని, ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని చెప్పినా వాటిని పెడచెవిన పెట్టారని రేవంత్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఏడేళ్లైనా పూర్తి చేయ లేదన్నారు. ప్రతి మెగా వాట్‌కు రూ.6.75కోట్ల ఖర్చు చేస్తున్నామని ప్రకటించారని , టెండర్ల కాలం వృధా అవుతుందని చెప్పి రైతులు, ప్రజల సెంటిమెంట్‌ అడ్డం పెట్టుకుని రూ.6.75కోట్ల మెగావాట్‌కు భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కొనుగోలు చేశారని, కానీ చివరకు దానిని నిర్మించేనాటికి మెగావాట్‌కు 9.75కోట్లు ఖర్చు చేశారన్నారు. కాలం చెల్లిన టెక్నాలజీ కోసం పదివేల కోట్ల ఖర్చు చేసి విద్యుత్ సంస్థలను నష్టపోయేలా చేశారని ఆరోపించారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

యాదాద్రిలో వేల కోట్ల అక్రమాలు….

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసి తెలంగాణలో వెలుగులు నింపుతామన్నారని చెప్పుకున్నారని, 1-6-2015లో ప్రారంభించిన ఈ ప్లాంట్‌ ప్రతి మెగావాట్‌ రూ.6.27కోట్లకు నిర్మాణం చేస్తామన్నారని రేవంత్‌ రెడ్డి వివరించారు. ఆ ప్లాంట్‌ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని చెప్పారు. యాదాద్రి ప్లాంట్‌ నిర్మాణంపై ఆలస్యానికి బిఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు. మెగావాట్‌కు రూ.8.64కోట్లకు ఖర్చు పెరిగిందని, పూర్తయ్యే సరికి రూ.9కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

ఎన్టీపీసీ రామగుండం ఫేజ్‌ 1లో ప్రాజెక్టు నిర్మాణంలో మెగావాట్‌‌ను రూ.7.63కోట్లతో ఎన్టీపీసీ పూర్తి చేసిందన్నారు. యాదాద్రి అంచనాలు 34,543కోట్లకు అంచనాలు పెరిగాయన్నారు. యాదాద్రి అంచనాలు పెరగడానికి, పూర్తి కాకపోవడానికి టెక్నాలజీ వినియోగం విషయంలో అక్రమాలపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

విచారణకు బిఆర్‌ఎస్‌ ముందుకు వచ్చినందున పూర్తి స్థాయిలో న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచారని పదేపదే చెబుతున్నారని, తెలంగాణ ఏర్పడే నాటికి 7778 మెగావాట్ల సామర్థ్యం ఉంటే 19,474 మెగావాట్ల సామర్థ్యం ఉందని చెబుతున్నారని అదే సమయంలో ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి ఏమి పెరగలేదన్నారు.

తెలంగాణలో ప్రైవేట్‌ రంగంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్ళు, సోలార్‌ ఉత్పత్తి మాత్రమే పెరిగిందన్నారు. భద్రాద్రికి కాలం చెల్లిన టెక్నాలజీ వాడితే, 35వేల కోట్లతో ఖ‌ర్చు చేసిన యాదాద్రిలో ఒక్క మెగావాట్‌ కూడా ఇంకా ఉత్పత్తి చేయలేదన్నారు.

లాగ్‌బుక్‌లు మాయం…

విద్యుత్‌ సరఫరాపై మంత్రి కోమటిరెడ్డి లాగ్‌బుక్‌లు తనిఖీ చేస్తే సబ్‌ స్టేషన్లలో లాగ్‌బుక్‌లు మాయం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 9 నుంచి 12 గంటలు మాత్రమే ఇచ్చారని సింగల్ ఫేజ్‌లో విద్యుత్ ఇచ్చి ఎవరికి లబ్ది కలిగించారని ప్రశ్నించారు.

24గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై అఖిలపక్షం ఏర్పాటు చేసి 24గంటల ఉచిత విద్యుత్‌పై విచారణ జరిపిద్దామని చెప్పారు. సింగల్‌ ఫేజ్‌ విద్యుత్‌తో రైతులకు ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. జ్యూడిషియల్ విచారణ వేయాలని ప్రతిపక్షమే కోరిందని చెప్పారు.

మరోవైపు భద్రాద్రి ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ నిబంధనలకు అనుగుణంగానే బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టినట్టు జగదీశ్ రెడ్డి చెప్పారు. తాము సబ్ క్రిటికల్ ప్లాంట్‌‌ తీసుకునే సమయానికి దేశంలో 39ప్లాంట్లకు కేంద్రం అనుమతించిందని చెప్పారు. విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చత్తీస్‌ఘడ్‌ పవర్ మీద ఈఆర్‌సి నిబంధనల మేరకే ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు.