Khammam Floods : కోలుకుంటున్న ఖమ్మం - సర్టిఫికెట్లు, విలువైన పత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు
ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రతి పునరావాస కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు.
మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు వేగంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా నగరంలోని 11, 16, 17, 28, 29, 30, 34, 35, 46, 47, 48, 59, 60 డివిజన్లలో నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఈ 13 డివిజన్లలో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 9,292 బాధిత కుటుంబాలు మున్నేరు బారిన పడినట్లు సర్వేలో గుర్తించినట్లు వివరించారు. ఈ డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మున్నేరు వరద కారణంగా ఏర్పడిన నష్టం, పునరావాస చర్యలపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పునరావాస చర్యలు ఇలా..
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో స్వర్ణభారతి ఫంక్షన్ హాల్, దంసలాపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, జూబ్లీక్లబ్ మొత్తం 5 చోట్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 7,700 మందిని అక్కడకు తరలించి, వసతితో పాటు, 9 రోజుల పాటు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
13 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే చేపట్టామన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. 28 వేల నిత్యావసర వస్తువులు, బ్లాంకెట్లు, దుస్తులు ముంపు బాధితులకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అన్నారు. 14 బృందాలు ఏర్పాటు చేసి, దెబ్బతిన్న ఇండ్ల సర్వే చేపట్టామన్నారు. పారిశుద్ధ్య చర్యల పరంగా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 980 మంది పారిశుద్ధ్య కార్మికులను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు.
ఖమ్మం నగరపాలక సంస్థ నుంచి 650, గ్రేటర్ వరంగల్ నుంచి 150, నల్గొండ నుంచి 50, వివిధ గ్రామ పంచాయతీల నుంచి 130 మంది ఇందులో ఉన్నారన్నారు. 37 జేసీబిలు, 60 ట్రాక్టర్లు, 59 వాటర్ ట్యాoకర్లు, 30 స్వచ్ఛ ఆటోలు పారిశుద్ధ్య పనులకు వినియోగించినట్లు కలెక్టర్ వివరించారు. ఫైర్ ఇంజన్ల ద్వారా రోడ్లు, ఇండ్లలోని బురద తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు. త్రాగునీటి సరఫరా పునరుద్ధరణ వేగంగా పూర్తి చేశామన్నారు. వరదల కారణంగా దానవాయిగూడెం ఎంఎల్డి దెబ్బతిని పని చేయకపోవడంతో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా 559 బోర్ వెల్స్, 78 పవర్ బోర్ల, 9 నగరపాలక సంస్థ స్వంత, 13 అద్దె, 40 గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన వాటర్ ట్యాoకర్ల ద్వారా నీటి సరఫరా చేశామని చెప్పారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకై బ్లీచింగ్ చల్లడం, కీమోఫాస్ స్ప్రే చేయడం, నీటి నిల్వల వద్ద ఆయిల్ బాల్స్ వెదజల్లడం చేస్తున్నట్లు ఆయన అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ పై సాంస్కృతిక సారథి కళాకారులు, మెప్మా, ఆశా వర్కర్లచేత ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజల్లో చైతన్యం తెస్తున్నట్లు ఆయన చెప్పారు.
సర్టిఫికెట్ల జారీకి..
ముంపు ప్రాంతాల్లో వరదల కారణంగా సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు కోల్పోయిన వారికి అందజేయుటకు 8 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు కోల్పోయిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి చేపట్టామన్నారు. వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి, రెండో వారంలో సంబంధిత శాఖలచే సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని… ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ వివరించారు.