Ambulance Smuggling: అంబులెన్స్‌లో గంజాయి రవాణా, 2కోట్ల విలువైన 4 క్వింటాళ్ళ గంజాయి స్వాధీనం
Ambulance Smuggling: గంజాయి రవాణా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు రూటు మార్చి రవాణా చేస్తూనే ఉన్నారు. అంబులెన్స్‌లో గంజాయి రవాణా చేస్తూ టైర్ పంక్చర్ అవడంతో పట్టుబడిన ఘటన కొత్తగూడెంలో జరిగింది.స్థానికుల సమాచారంతో పోలీసులు వాహనంలో తనిఖీ చేసి 2కోట్ల విలువైన గంజాయి పట్టుకున్నారు
Ambulance Smuggling: శతకోటి దరిద్రాలకు అనంకోటి ఉపాయాలన్నట్టు గంజాయి రవాణాపై పోలీసుల నిఘా తప్పించుకోడానికి ఏకంగా అంబులెన్స్‌లో రవాణా చేస్తూ దొరికిపోయారు. డ్రైవర్ అదృష్టం బాగోలేక టైర్ పంక్చర్ కావడం, అక్కడే ఉన్న యువకులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. కొత్తగూడెంలోని రామవరంలో ఈ ఘటన వెలుగు చూసింది.
అంబులెన్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తూ డ్రైవర్ దొరికిపోయాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని రామవరం సమీపంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఘటనలో ఏకంగా రెండుకోట్ల రుపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏజెన్సీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనంలో కొత్తగూడెం మీదుగా తరలిస్తున్నారు. రామవరం శివార్లలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వా తటైరు పంక్చర్ కావడంతో నిలిచిపోయింది. అర్థరాత్రి రోడ్డుపై అంబులెన్స్ నిలిచిపోవడంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానిక యువకులకు డ్రైవర్ పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు.
వాహనం తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉండటంతో ఎక్కడి నుంచి ఎక్కడి వెళుతోందని ఆరా తీశారు. అంబులెన్స్‌లో డ్రైవర్ తప్ప ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో డ్రైవర్‌ను ప్రశ్నించారు. వాహనంలో పరిస్థితులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అంబులెన్స్ నిలిచిపోయిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నించారు. వాహనంలో తనిఖీలు నిర్వహించారు. అందులో 4 క్వింటాళ్ల గంజాయి పట్టుబడటంతో ఖంగుతిన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో నిఘా తక్కువగా ఉండే మార్గాల్లో చెన్నైకు సరుకు రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. యువకుల అప్రమత్తతతో గంజాయి పట్టుబడటంతో స్థానిక యువకులను పోలీస్ అధికారులు అభినందించారు.