Vegetable Rates : తూర్పుగోదావరి జిల్లాలో కూర‌గాయ‌ల ధ‌ర‌లకు రెక్కలు, అమాంతం పెరిగిన నిత్యావ‌స‌రాల రేట్లు-east godavari district vegetable rates going to high non veg eggs rates also ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vegetable Rates : తూర్పుగోదావరి జిల్లాలో కూర‌గాయ‌ల ధ‌ర‌లకు రెక్కలు, అమాంతం పెరిగిన నిత్యావ‌స‌రాల రేట్లు

Vegetable Rates : తూర్పుగోదావరి జిల్లాలో కూర‌గాయ‌ల ధ‌ర‌లకు రెక్కలు, అమాంతం పెరిగిన నిత్యావ‌స‌రాల రేట్లు

HT Telugu Desk HT Telugu
Jun 12, 2024 04:39 PM IST

Vegetable Rates : తూర్పుగోదావరి జిల్లాల్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఇటీవల వర్షాలకు కూరగాయ పంటలు దెబ్బతినడంతో ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు అంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కూర‌గాయ‌ల ధ‌ర‌లకు రెక్కలు
తూర్పుగోదావరి జిల్లాలో కూర‌గాయ‌ల ధ‌ర‌లకు రెక్కలు

Vegetable Rates : తూర్పుగోదావరి జిల్లాల్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధ‌ర‌ల మంట‌కు సామాన్యుల క‌ల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ధ‌ర‌ల‌ను చూసి సామాన్యులు విల‌విలలాడుతున్నారు. ఇటీవ‌లి కురిసిన అకాల వ‌ర్షాల వ‌ల్లే కూర‌గాయల ధ‌ల‌కు రెక్కలు వ‌చ్చాయ‌ని రైతులు, విక్రయ‌దారులు పేర్కొంటున్నారు. కూర‌గాయ‌లు, ఇత‌ర వంట స‌రుకుల ధ‌ర‌లు సామాన్యుని వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేట‌ట్టు లేదు...ఏం తినేట‌ట్టు లేదు అన్న ప‌రిస్థితి నెల‌కొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధ‌ర‌లు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

వారం క్రితం వ‌ర‌కూ కిలో ట‌మాటా రూ.20 ఉండ‌గా, ప్రస్తుతం అది మూడింత‌లు పెరిగి రూ.60కు చేరింది. ప‌చ్చిమిర్చిని ముట్టుకుంటే ధ‌ర ఘాటు పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 ఉండ‌గా, ప్రస్తుతం అది రూ.100కు చేరింది. కేజీ ఉల్లి ధ‌ర గ‌త వారం రూ.22 ఉండ‌గా, ప్రస్తుతం అది రూ.50కి చేరింది. కేజీ చిక్కుళ్లు ధ‌ర గ‌త వారం రూ.40 ఉండ‌గా, ఇప్పుడది రూ.120కి చేరింది. క్యాప్సిక‌మ్ కేజీ రూ.60 నుంచి రూ.100కు పెరిగింది. బీర‌కాయ ధ‌ర గ‌త వారంలో కేజీ రూ.60 ఉండ‌గా, ప్రస్తుతం రూ.100కి చేరింది.

ఆకుకూరల ధరలు ఆకాశానికి

కాయ‌గూర ధ‌ర‌లే కాకుండా ఆకుకూరల ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటాయి. అన్ని ర‌కాల ఆకు కూర‌లు రూ.20కు మూడు క‌ట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండు క‌ట్టలే ఇస్తున్నారు. కొత్తిమీర రూ.10కి దొరికేది, ఇప్పుడది రూ.40కి చేరింది. అల్లం ధ‌ర సామాన్యునికి అంద‌నంత ఎత్తుకు పోయింది. పది రోజుల క్రిత‌మే కేజీ అల్లం రూ.80 ఉండ‌గా, ఇప్పుడ‌ది రూ.280కి చేరింది. దీంతో అల్లం కొనడానికి సామాన్యులు వెన‌క‌డుగు వేస్తున్నారు. అయితే కాయ‌గూర‌, ఆకుకూరల ధ‌ర‌లు పెర‌గ‌డానికి అకాల వ‌ర్షాలే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అకాల వ‌ర్షాల‌తో పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని, అందువ‌ల్ల కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల పంట‌లు దెబ్బతిన్నాయ‌ని రైతులు చెబుతున్నారు. దీనివ‌ల్ల పంట చేతికి రాక‌, మార్కెట్లోకి వెళ్లక ధ‌ర‌లు పెరిగాయ‌ని చెబుతున్నారు. విక్రయ‌దారులు కూడా అకాల వ‌ర్షాల‌నే ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణంగా చెబుతున్నారు.

నాన్ ధరలు పైపైకి

అలాగే చికెన్, మ‌ట‌న్‌, గుడ్లు ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ రూ. 250 పలుకుతుంది. ముప్పై గుడ్ల ట్రే రూ.170 నుంచి రూ.190 ప‌లుకుతుంది. అలాగే మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్యల వంటి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. మ‌ట‌న్ కేజీ రూ.1,000కు చేరింది. కిరాణా స‌రుకుల ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఈ ధ‌ర‌లు సామాన్యుడికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. నెల రోజుల క్రితం వంద గ్రాముల జీల‌క‌ర్ర ధ‌ర రూ.40 ఉండ‌గా, ఇప్పుడు అది రూ.80 చేరింది. వెల్లుల్లి కేజీ రూ.90 ఉండ‌గా, అది ప్రస్తుతం రూ.150కి చేరింది. ప‌ప్పులు ధ‌ర‌లు కూడా కేజీ ద‌గ్గర రూ.30 నుంచి రూ.40 వ‌ర‌కు పెరిగాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు , హిందూస్థాన్ టైమ్స్ తెలుగు