CBN Anakapalli tour: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన, పోలవరం ఎడమకాల్వ పరిశీలన, మెడ్‌టెక్ జోన్ ప్రారంభోత్సవం
CBN Anakapalli tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అనకాపల్లి వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.
CBN Anakapalli tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన జరుగుతోంది. పోలవరం ఎడమ కాల్వ పనుల పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన సీఎం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 2014-19 మధ్య పట్టిసీమ తరహాలోనే ఎడమ కాల్వకు కూడా నీటిని తరలించాలని చంద్రబాబు ప్రయత్నించారు. సాంకేతిక అవరోధాలతో పాటు భూసేకరణ సమస్యలతో పనులు పూర్తి కాలేదు.
ప్రస్తుతం పోలవరం ఎడమ కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్థానికుల అవసరాలతో పాటు విశాఖపట్నంకు తాగునీటి తరలింపు ప్రాధాన్యత నేపథ్యంలో ఎడమ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రజల రుణం తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రంలో ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల తర్వాత విశాఖ అత్యధికంగా ఓట్లు వచ్చాయని, ప్రజలక రుణం తీర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు. అనకాపల్లిలో సిఎం రమేష్, అనితలను గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్డీఓలో ముందుకు వెళ్లాయన్నారు.
అరాచకాలు చేసి, తప్పులు చేసిన వ్యక్తుల్ని ప్రజలు ఎలా శిక్షించారో చూశామన్నారు. రాజకీయాలను సరి చేసే శక్తి ప్రజలకే ఉందన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబెట్టుకోవాలని తాను పదేపదే చెప్పానన్నారు. ప్రజలు ఇప్పటికే గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టుకోడానికి తన ప్రయత్నం చేస్తానన్నారు.
పోలవరంపై ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేశామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి అనకాపల్లితో పాటు ఉత్తరాంధ్ర సశ్యశ్యామలం అవుతుందన్నారు. అనకాపల్లిలో 2.80లక్షల ఎకరాలు, తాగునీరు వస్తాయన్నారు. ఐదేళ్ల క్రితం పనులు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికి అక్కడే ఉండిపోయాయన్నారు.
2021 జూన్‌కు పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పుడు ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం కాల్వ ద్వారా గోదావరి నీళ్లు వస్తే కరువు అనే సమస్య ఉండేది కాదన్నారు. పురుషోత్తమపట్నం లిఫ్ట్, పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని అందిస్తామన్నారు. గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలని, గోదావరి నీరు వస్తున్నా, విశాఖకు తాగు, సాగు నీరు రావాల్సి ఉందన్నారు. పోలవరం పూర్తయ్యే లోపు పురుషోత్తపట్నం, పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తరలిస్తామన్నారు. 2500క్యూసెక్కుల నీటిని అనకాపల్లి ప్రాంతానికి తరలిస్తామన్నారు. అండర్ పాస్ పూర్తి చేసి యుద్ధప్రాతిపదికన నీళ్లు తరలిస్తామన్నారు. ఇందులో కాలయాపన చేయమని నేడే టెండర్లు పిలుస్తామన్నారు.
వచ్చిన డబ్బులు అరకొరగా ఉంటున్నాయని, ప్రాధాన్యత క్రమంలో రూ.800కోట్లతో 93కిలోమీటర్ల వరకు కాల్వలు పూర్తి చేస్తే అనకాపల్లిలో మొదట లక్ష ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని దానిని వెంటనే పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన కార్యచరణ సిద్ధం చేస్తామన్నారు. 214కిలోమీటర్ల పొడవున కాల్వలు పూర్తైతే 4లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, 23టిఎంసిల నీటితో అనకాపల్లిలో ఇంటింటికి కుళాయి ద్వారా నీటిని తీసుకు వెళ్లొచ్చన్నారు. మొదటి విడతలో రూ.800కోట్ల ఖర్చుతో 93వ కిలోమీటర్ వరకు నీటిని అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వంశధార వరకు వెళుతుందన్నారు.
పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన తర్వాత చంద్రబాబు భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శిస్తారు. ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
అనకాపల్లిలో ఉన్న మూడు చక్కెర ఫ్యాక్టరీలు మూతబడటానికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. రైతుల భాగస్వామ్యంతో పనిచేయాలని, ఇథనాల్ తయారు చేస్తే షుగర్ ఫ్యాక్టరీలు నడపొచ్చని సూచించారు. షుగర్ ఫ్యాక్టరీలు ఖాయిలా పడే పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
ఆ తర్వాత వర్చువల్‌గా సీఐఐ కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మెడ్ టెక్ జోన్ లో కొత్తగా నిర్మించిన భవనాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. మెడ్‌టెక్ జోన్ కార్మికులతో సమావేశం అవుతారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు.