Tirumala : అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు-arrangements are being made to organize tirumala srivari brahmotsavam in grandeur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Tirumala : అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Basani Shiva Kumar HT Telugu
Oct 03, 2024 04:15 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు.. టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం.. అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో మీడియాతో మాట్లాడారు.

అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (TTD)

ఈ ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని.. టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. గురువారం మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి వివరించారు.

'ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసింది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 5వ తేదీ తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ.13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు' అని టీటీడీ ఈవో చెప్పారు.

'భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ప‌లు ఆర్జితసేవలు రద్దయ్యాయి. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచాం. లడ్డూ కౌంటర్లు 2023లో 54 ఉండగా.. 2024లో 65 ఏర్పాటు చేశాం. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. బ్రేక్‌ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం అవుతుంది. గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేశాం' అని ఈవో శ్యామలరావు వెల్లడించారు.

'శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1.32 లక్షల రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాం. తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయి. అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేశాం. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ఉద్యానవన, విద్యుత్‌ విభాగాల ఆధ్వర్యంలో శోభాయమానంగా అలంకరణలు చేపడుతున్నాం' అని ఈవో వివరించారు.

'దాదాపు 1250 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాం. పోలీసు సిబ్బంది దాదాపు 3900 ఉన్నారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత ఏర్పాటు చేయబోతున్నాం. ఆలయ మాఢ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,775 సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండి పర్యవేక్షిస్తాం. పిఏసి 4లోని సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో.. వీడియోవాల్‌ ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం' అని టీటీడీ ఈవో వెల్లడించారు.

'లక్షలాది భక్తులు వాహనసేవలు వీక్షించేందుకు ఆలయ నాలుగు మాఢ వీధుల్లో గ్యాలరీలు సుందరంగా తీర్చిదిద్దాం. తిరుమలలో ఎల్ఈడి స్క్రీన్లు గత సంవత్సరం 3 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేయగా.. 2024లో 9 రోజుల పాటు 28 స్క్రీన్లు ఏర్పాటు చేశాం. గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు మాఢ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్‌, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్‌ హౌస్‌ ఇతర ప్రాంతాల్లో కలిపి 28 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం' అని వివరించారు.

'శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన వసతి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకున్నాం. తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్‌లైన్‌లో భక్తులకు కేటాయిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించాం. వీఐపీ ఏరియాలో 1,353 గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని గదుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు బస చేసే అవకాశముంది' అని టీటీడీ ఈవో అంచనా వేశారు.

'పిఏసి 1, 2, 3, 4లలో కలిపి 28 హాళ్లలో.. దాదాపు 6700 లాకర్లు ఉన్నాయి. దాదాపు 20 వేల మంది భక్తులు బస చేయవచ్చు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వసతి పొందలేని భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది. అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా.. అక్టోబరు 7, 8వ తేదీలలో కాటేజి దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలపై గదులు కేటాయించబోం. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని మనవి చేస్తున్నాం' అని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.

'గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లను తెరిచి ఉంచుతాం. బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు దాదాపు 2 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తాం. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు.. 24 గంటల పాటు ఉచిత బస్సులను ఏర్పాటు చేశాం. ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం. సాధారణ రోజుల్లో 8 ప్రాంతాల్లో, గరుడ సేవ నాడు 12 ప్రాంతాలలో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు ఏర్పాటు చేస్తాం' ఈవో వివరించారు

'శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మ‌హ‌త్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి చేస్తున్నాం. సంయమనంతో వ్యవహరించి.. స్నానమాచరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశాం. భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్ల తోపాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచాం' అని ఈవో వెల్లడించారు.

Whats_app_banner