AP 3 Free Gas Cylinders : 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ సర్కార్ కసరత్తు, త్వరలోనే విధివిధానాలు ప్రకటన
AP 3 Free Gas Cylinders : ఏపీలో అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది కాగా..వీరికి 3 సిలిండర్లు పథకం అమలుచేస్తే రూ.3640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
AP 3 Free Gas Cylinders : ఏపీ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఏడాది 3 గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది కాగా..వీరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ.3640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కసరత్తు జరుగుతోంది. జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అధికారులు లెక్కలేస్తున్నారు. కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ.837గా ఉండగా, ఏటా రూ.2,511 ఆదా ఆవుతుంది.
సీఎం చంద్రబాబు ప్రకటనతో పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలోని 1.55 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని అమలుచేస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తు్న్నారు. దీపం, ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు ఉన్న 75 లక్షల మందికే ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కకడుతున్నారు. ఏటా ఎంత వ్యయం అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాల అమలుపై పౌరసరఫరాల శాఖ అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీ భేటీ అయ్యి సీఎంకు పలు సిఫారసులు చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఆమోదం వచ్చాక విధివిధానాలు ప్రకటిస్తారు.
దీపం పథకాన్ని ఉజ్వలలో చేరిస్తే
ఏపీలో 1999 నుంచి దీపం పథకం అమల్లో ఉంది. వీటిని ఉజ్వల పథకం కింద పరిగణనలోకి తీసుకుని రూ.300 చొప్పున రాయితీ ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. దీన్ని కేంద్రం ఆమోదిస్తే దీపం, ఇతర పథకాల ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల కిందకు వస్తాయి. దీంతో ఏపీపై ఏడాదికి రూ.585 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్లకు రూ.2925 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది.
2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ లో సుమారు 9.70 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లపై కేంద్రం ఒక్కో సిలిండర్‌పై రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు ఈ రాయితీ అందిస్తుంది. దీపం పథకాన్ని ఉజ్వలలో చేరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.525.50 చొప్పున రాయితీ చెల్లించాల్సి ఉంటుంది. మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.153 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంధన కంపెనీలు ఏడాదికి మొత్తంగా రూ.1,763 కోట్లు భరించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం