AP Free Gas Cylinders : మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం
AP Free Gas Cylinders : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
AP Free Gas Cylinders : కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని మరో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మహాశక్తి పథకంలో భాగంగా పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటికింటీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. వందరోజుల పాలన ప్రగతిని "ఇది మంచి ప్రభుత్వం"పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 100 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుమల పవిత్రత దెబ్బతీశారు
గత 5 ఏళ్లుగా కనీసం విశాఖ రైల్వే జోన్ సాధించలేకపోయారని సీఎం చంద్రబాబు వైసీపీ విమర్శలు చేశారు. కేంద్రం అడిగిన భూమి ఇవ్వలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వస్తూనే ల్యాండ్ క్లియర్ చేసిందని, తొందర్లోనే విశాఖ రైల్వే జోన్ పనులు మొదలవుతాయన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారన్నారు. తిరుమల లడ్డూ విషయంలో గతంలో జరిగింది చూస్తే బాధ వేస్తుందన్నారు. తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని ఆరోపించారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. విషయం తెలిసి ఆందోళన చెందానని, ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు.
"విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. వీళ్ల జీవితంలో స్టీల్ ప్లాంట్ గురించి పోరాడింది లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో కాపాడింది మేమే, మళ్లీ కాపాడే బాధ్యత మాదే. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి 5 ఏళ్లలో సాధించేలా మన ప్రభుత్వం పని చేస్తుంది."- సీఎం చంద్రబాబు
సంబంధిత కథనం