Visakha Railway Station : విశాఖ రైల్వే స్టేషన్ లో మంటలు - దగ్దమైన రైలు బోగీలు
Visakhapatnam Railway Station: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు దగ్ధమయ్యాయి.
విశాఖ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బీ6, బీ7, ఎం1 బోగీలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్ అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. రైల్వేస్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ప్రయాణికులను అధికారులు బయటికి పంపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బీ7 బోగీలోని మరుగుదొడ్డిలో షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా మూడు బోగీలు దగ్ఘమయ్యాయి. అయితే మంటలు చెలరేగినప్పుడు బోగీలలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
ముగ్గురు యువకులు మృతి….
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాకు చెందిన కన్నయ్య(22) స్నేహితులతో కలిసి శనివారం రాత్రి కారులో శ్రీశైలం బయల్దేరాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా రద్దీ పెరిగింది. జలాశయ సందర్శన కోసం పెద్ద ఎత్తున జనాలు తరలివస్తుండటంతో ఘాట్ రోడ్డులో కిలో మీటర్ల మేర రద్దీ ఏర్పడుతోంది. నెమ్మదిగా వానానాలు ముందుకు కదులుతున్నాయి.