Yadadri Ghee : ల్యాబ్‌కు యాదాద్రిలో వాడే నెయ్యి.. కారణం ఇదేనన్న టెంపుల్ ఈవో!
Yadadri Ghee : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నెయ్యి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమలలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని ఆలయాల్లో వినియోగించే నెయ్యిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాదాద్రిలో వాడే నెయ్యిని ల్యాబ్‌కు పంపారు.
తిరుమల లడ్డూ, ప్రసాదం తయారీ కోసం వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు పధార్థాలు కలుస్తున్నాయని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తిరుమలలో మాత్రమే కాకుండా.. ఏపీలోని ప్రధాన ఆలయాల్లో నెయ్యి వ్యవహారంపై ఫోకస్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అధికారులు అలర్ట్ అయ్యారు.
తాజాగా.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని పరీక్షించేందుకు హైదరాబాద్ చర్లపల్లిలోని ల్యాబ్‌కు పంపారు. ఈ విషయాన్ని ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. యాదాద్రిలో విక్రయించే ప్రసాదాలలో లడ్డూ, పులిహోర నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. యాదాద్రికి మదర్ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అవుతోందన్నారు.
2021 డిసెంబర్ నెలలో యాదాద్రి ప్రసాదంపైనా విమర్శలు వచ్చాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన అప్పట్లో వెలుగులోకి వచ్చింది.
'భక్తులు చూసుకోకుండా తింటే ప్రాబ్లమ్ అవుతుంది. దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను' అంటూ ఆ భక్తులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయం దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని.. వాటిపై ఉన్న కవర్ పడినట్లుందని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
యాదాద్రిలో పులిహోర 200 గ్రాములు 5 రూపాయలకు ఇస్తారు. దద్దోజనమ్ 200 గ్రాములు 3 రూపాయలకు విక్రయిస్తారు. 80 గ్రాముల లడ్డూ 5 రూపాయలకు లభిస్తుంది. 75 గ్రాముల వాడ 5 రూపాయలకు పంపిణీ చేస్తారు. యాదాద్రి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 7.15 నుండి రాత్రి 9 గంటల వరకు 100 కిలోల పులిహోర ప్రసాదం, 6 కిలోల దద్దోజనం ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.