TGSRTC : గణపతి భక్తులకు శుభవార్త.. 600 స్పెషల్ బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం
TGSRTC : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండువగా జరుతుంది. ఈ మహా నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలే కాకుండా.. ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వస్తారు. ఈ నేపథ్యంలో గణపయ్య భక్తులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సులు నడపనుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వినాయక నిమజ్జన వేళ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 30 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని.. గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.
మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు..
గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొంది. అలాగే నిమజ్జనానికి అవసరమైన అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాలని సూచించింది.
ఎంఎంటీఎస్ కూడా..
గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుండి 18 మధ్య రాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్యస్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. 8 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
రైలు నెం- GHL-5 (హైదరాబాద్- లింగంపల్లి) సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
రైలు నెం- GHS-1 (సికింద్రాబాద్- హైదరాబాద్) సెప్టెంబర్ 17 రాత్రి 11:50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
రైలు నెం- GHS-6 (లింగంపల్లి- ఫలక్‌నుమా) సెప్టెంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 12:10 గంటలకు లింగంపల్లి నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.
రైలు నెం- GHS-7 (ఫలక్‌నుమా- సికింద్రాబాద్) సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:20 గంటలకు ఫలక్ నుమా నుండి బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఫలకున్మా చేరుకుంటుంది.
ఈ రైళ్లనే తిరిగి మళ్లీ స్టార్ట్ అయిన స్టేషన్లకు పంపిస్తారు. ఆఖరి సర్వీస్ సికింద్రాబాద్- హైదరాబాద్ మధ్య నడుస్తుంది. 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై.. 4 గంటల 40 నిమిషాలకు ఎంఎంటీఎస్ ఆఖరి సర్వీస్ ముగియనుంది. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.