MMTS Trains cancelled : ప్రయాణికులకు అలర్ట్ - ఇవాళ, రేపు 22 ఎంఎంటీఎస్, 4 డెమూ రైళ్లు రద్దు.. రూట్లు ఇవే
Hyderabad MMTS Trains Updates: హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా రూట్ల వివరాలతో పాటు తేదీలను వెల్లడించింది.
Cancellation MMTS Train Services: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే 25, 26 తేదీల్లో పలు రూట్లలో నడిచే రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు అయ్యాయి.
ఇవే కాకుండా సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు రద్దు చేస్తున్నట్లు వివరించింది. మొత్తంగా 26 రైలు సర్వీసులు రద్దు అయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు….
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు గతేడాదిలోనే శంకుస్థాపన జరిగింది. మొత్తం 719 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టారు. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేస్తారు. స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడనున్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీతో పాటు ప్రయాణికులను సులభంగా రాకపోకలు జరిపేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయింది. మరో రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
కొత్త స్టేషన్ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.
టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు.సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్‌లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తీసుకువస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉండేలా ప్లాన్ రూపొందించారు. దక్షిణమధ్య రైల్వే స్వయంగా ఈ ప్రాజెక్ట్ పనులను చేస్తోంది.