Secunderabad MP: సికింద్రాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఎవరు? తలసాని నిరాకరణతో అభ్యర్ధిపై అందరిలో ఆసక్తి…
Secunderabad MP: సికిింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. రోజుకో పేరు తెరపైకి వస్తోంది.
Secunderabad MP: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బిఆర్‌ఎస్ నుంచి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ మరోసారి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది . తలసాని కుమారుడితో పాటు సికింద్రాబాద్ Secunderabad ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,అయన కుమారుడు రామేశ్వర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి.
గత శాసన సభ ఎన్నికల్లో BRS నేత పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ పోటీ చేస్తారని భావించినా, అంతిమంగా పద్మ రావే పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు కారు దిగి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్ సభకు పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.
బీజేపీ నుంచి Loksabha అభ్యర్ధిగా మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉండనున్నారు.ఈ క్రమంలోనే ఇరు పార్టీలను ధీటుగా ఎదుర్కునేందుకు గులాబీ పార్టీ నుంచి పద్మారావు బరిలో దింపాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు,. పోటీకి ససేమిరా అన్న పద్మారావు....తన కొడుకు పరమేశ్వర రావు పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
తండ్రులా…తనయులా…?
ప్రస్తుతం హస్తినలో ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో పద్మారావు Padma Rao అతని కుమారుడు పరమేశ్వర రావు భేటీ అయినట్లు విశ్వశనీయ వర్గాల సమాచారం. అక్కడ చర్చల అనంతరం సికింద్రాబాద్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈసారి సికింద్రాబాద్ నుంచి పార్టీ సీనియర్ నేతలు పోటీలో ఉంటారా....? లేక వారి తనయులే బరిలో ఉంటారా అన్నది తేలడానికి మరి కాస్త సమయం పడుతుంది. పోటీకి సీనియర్లు అంతగా ఆసక్తి చూపకపోవడంతో పార్టీ అధిష్ఠానం తనయుల పై ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. అటు పద్మారావు ఇటు తలసాని తనయుల్లో ఎవరో ఒకరికి లోక్ సభ టికెట్ దక్కవచ్చని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నా, తలసాని సాయి కిరణ్ మాత్రం పోటీలో ఉండలేని పరోక్షంగా పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.
తలసాని మౌనం వెనుక అర్థమేమిటి...?
బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి బడా రాజకీయ ప్రముఖులు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడల్లా విమానాశ్రయంలో అనేక సార్లు ముఖ్యమంత్రికి బదులుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికే వారు.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేస్తే .వెనువెంటనే ఆ విమర్శలను తలసాని ప్రెస్ మీట్ లు పెట్టీ తిప్పి కొట్టేవాడు. అధికారంలో ఉన్న సమయంలో ప్రతీ దానిలో దూకుడుగా వ్యవహరించిన తలసాని ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో స్పీడ్ అంతా తగ్గించారనే చెప్పాలి.
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గత బిఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కుంభకోణాలే అని విమర్శిస్తున్నా, తలసాని మాత్రం నోరు విప్పలేదు.ఇటు బిఅర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ధర్నా,నిరసన కార్యక్రమాలకు కూడా అయన దూరంగా ఉన్నాడు.
ఇటీవలే బయటపడిన గొర్రెల స్కాం లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందని సమాజిక వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.ఇప్పటికే ఆ స్కాం లో పలువురు అధికారులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
తమ పార్టీ అధికారంలో లేనందున అనవసర వివాదాల్లో తల దూర్చకూడదని ఆయన భావిస్తున్నారు.అందుకే గత కొన్ని రోజులుగా ఆయన ఎవరిపై రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం లేదని చెబుతున్నారు.
(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)
సంబంధిత కథనం