Minister Talasani : రేవంత్ ... నీ భాష మార్చుకో, నోరు అదుపులో ఉంచుకో - మంత్రి తలసాని
Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తాము కూడా మాట్లాడగలమని… కానీ సంస్కారం అడ్డువస్తుందని చెప్పారు.

Minister Talasani Srinivas Yadav: పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. తన భాష మార్చుకొని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటికి అడ్డు అదుపూ లేని ఒక మూర్ఖుడిని పీసీసీ అద్యక్షుడిగా నియమించిందని విమర్శించారు. ఉన్నత పదవులలో ఉన్న వారిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందిచకపోవడం విచారకరమన్నారు.
“మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడగలం, మాకు సంస్కారం అడ్డు వస్తుంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెబుతారు. మీ పార్టీ ఎన్నికల ప్రచారంలో మీ విధానాల పై ప్రజలకు వివరించాలే కానీ పరుష పదజాలం ఉపయోగించడంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలి. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు తమను తాము అతిగా ఉహించుకుంటున్నారు, తమ తమ నియోజకవర్గాలలో ఓడిపోతామని తెలిసి తమ పార్టీ అధిష్టానాల మెప్పు కోసం ముఖ్యమంత్రి పై పోటీ చేస్తున్నారు” అని తలసాని కామెంట్స్ చేశారు.
ఓటమి భయంతోనే రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గంలో పోటీకి దూరంగా ఉన్నారని అన్నారు మంత్రి తలసాని. రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ పార్టీ…. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, గ్యారెంటీలు అంటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ప్రకటిస్తున్నారని… అవి అమలు కాకుంటే ప్రజలు ఎవరిని అడగాలని ప్రశ్నించారు.