Railway Corridor: సింగరేణిలో రైల్వే కోల్ కారిడార్..రామగుండం–మణుగురు మధ్య రైల్వేలైన్‌ నిర్మాణానికి నోటిఫికేషన్-notification for construction of railway line between ramagundammanuguru ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Railway Corridor: సింగరేణిలో రైల్వే కోల్ కారిడార్..రామగుండం–మణుగురు మధ్య రైల్వేలైన్‌ నిర్మాణానికి నోటిఫికేషన్

Railway Corridor: సింగరేణిలో రైల్వే కోల్ కారిడార్..రామగుండం–మణుగురు మధ్య రైల్వేలైన్‌ నిర్మాణానికి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
May 23, 2024 11:43 AM IST

Railway Corridor: సిరుల మాగాణి సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ రైల్వే కోల్ కారిడార్ నిర్మాణం కాబోతుంది. అందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.‌

రామగుండం-మణుగూరు మధ్య కోల్ కారిడార్‌కు నోటిఫికేషన్
రామగుండం-మణుగూరు మధ్య కోల్ కారిడార్‌కు నోటిఫికేషన్

Railway Corridor:పెద్దపల్లి జిల్లా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక 'రైల్వే బొగ్గు రవాణా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 207.80 కి.మీ. మేర నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని.. అందుకు తక్షణమే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

పాతికేళ్ళ తర్వాత కొలిక్కి..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, ములుగు మీదుగా మణుగూరు వరకు లైన్ నిర్మాణం కోసం పాతికేళ్ల క్రితం 1999లోనే అడుగు పడింది. ప్రస్తుతం భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లో రైల్వే ఇంజినీరింగ్ విభాగం సర్వే చేపట్టి సాధ్యాసాధ్యాలను రైల్వేశాఖకు నివేదిస్తుంది. అనంతరం భూసేకరణ సర్వే చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు.

2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషిచేస్తామని హామీ ఇచ్చింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ లైన్ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకుపోయి ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంచనా వ్యయం రూ.2,911 కోట్లు

మణుగూరు-రామగుండం ప్రాజెక్టు ప్రాథమిక పనులకు కేంద్రం 2013-14 బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించింది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, ఆనిధులు భరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముందడుగు పడలేదు. సరకు రవాణాకు మంచి మార్గం కావడం, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్న అంచనాతో ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి ప్రధాని కార్యాలయం గత ఏడాది ఆమోదం తెలిపింది. 2013-14లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,112 కోట్లు కాగా.. ఇప్పుడు రూ. 2,911 కోట్లకు పెరిగింది.

తగ్గనున్న బొగ్గు రవాణా వ్యయం..

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉన్న 26 భూగర్భ, 20ఉపరితల గనుల ద్వారా ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సింగరేణి ఏటా రూ. వందల కోట్లను కేవలం బొగ్గు రవాణాకే వెచ్చిస్తోంది. ప్రస్తుతం బల్లార్షా నుంచి ఖమ్మం ప్రాంతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మీదుగా 349 కి.మీ. రైల్వే మార్గం ఉంది. రామగుండం- మణుగూరు లైను నిర్మిస్తే దాదాపు 142 కి.మీ. దూరం తగ్గడమే కాకుండా బొగ్గు రవాణా వ్యయం తగ్గుతుంది.

ఈ రైలు మార్గంతో కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, మంథని వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు.. లక్నవరం చెరువు, బొగత జలపాతం వంటి జలపర్యాటక ప్రదేశాలు అనుసంధానమవుతాయి. ఈ రైల్వే లైన్ తో ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం సులువవుతుంది. ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే కాజీపేట మీదుగా తిరిగిపోవాల్సివస్తోంది.

కొత్త రైల్వే లైన్ పూర్తయితే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లొచ్చు. ఈ క్రమంలో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. దీంతోపాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెద్దపల్లి లో బైపాస్ రైల్వే లైన్ పనులు

రామగుండం- మణుగూరు రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నోటిపికేషన్ విడుదల చేయగా కొత్తగా ఏర్పాటయ్యే రైల్వే లైన్ కు పెద్దపల్లి మూల కేంద్రంగా మారనుంది. ఇప్పటికే పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ కావడంతో నిజామాబాద్, కరీంనగర్ నుంచి వచ్చే రైళ్లకు ఇక్కడే ఇంజిన్లను మారుస్తారు.

దీనికి సుమారు అరగంట నుంచి గంట వరకు పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో 2021లో పెద్దపల్లిలో బైపాస్ స్టేషన్ నిర్మించి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే పెద్దపల్లి నుంచి పెద్దబొంకూర్ మీదుగా పనులు నడుస్తున్నాయి. ఈ రైల్వే లైన్ ఉమ్మడి జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నది.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్ జిల్లా)