MMTS Trains Cancelled : హైదరాబాద్ వాసులకు అలర్ట్, నేటి నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు-hyderabad news in telugu south central railway cancelled 23 mmts trains up to february 11th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mmts Trains Cancelled : హైదరాబాద్ వాసులకు అలర్ట్, నేటి నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

MMTS Trains Cancelled : హైదరాబాద్ వాసులకు అలర్ట్, నేటి నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu
Feb 04, 2024 05:21 PM IST

MMTS Trains Cancelled : ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మౌలాలి- అమ్మగూడ - సనత్ నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు కొనసాగుతున్నాయి

ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

MMTS Trains Cancelled : హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 11 వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మౌలాలి- సనత్ నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నేటి నుంచి ఈనెల 11వరకు జంట నగరాల్లో తిరిగే 23 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఈ నెల 9 వరకు 3 ఎంఎంటీఎస్ రైళ్లు,10వ తేదీ వరకు మరో రెండు, 11వ తేదీ వరకు మరో 18 ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మౌలాలి- అమ్మగూడ - సనత్ నగర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్ టు పనులు కొనసాగుతున్నాయి. అందుకే సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు మొత్తం 51 రైళ్లను రద్దు చేశారు.ఈనెల 4 నుంచి 11 వరకు షెడ్యూల్ రైళ్ల రద్దు ఉంటుందన్నారు. హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ - గుంటూరు, రేపల్లె -సికింద్రాబాద్ తో పాటు లింగంపల్లి- హైదరాబాద్ ,లింగంపల్లి- ఉమ్దానగర్, లింగంపల్లి- ఫలక్ నామ స్టేషన్ల మధ్య షెడ్యూల్ ప్రకారం ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు.

అందుబాటులోకి మరో టెర్మినల్

హైదరాబాద్ లోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిద్ధం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) జనరల్ మేనేజర్ తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా సనత్ నగర్ - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ దాటి కొన్ని రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వెల్లడించారు.

ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి సికింద్రాబాద్, తిరుపతి , బెంగళూరు, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య రైలు నెం. 08579 ప్రతి బుధవారం నడపనున్నారు. విశాఖలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసును మార్చి 27 వరకు పొడిగించినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రైలు నెం.08580 ప్రతి గురువారం నడపనున్నారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

భువనేశ్వర్‌-తిరుపతి మధ్య రైలు నెం. 02809 ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇది భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుపతి-భువనేశ్వర్‌ మధ్య రైలు నెం.02810 ప్రతి ఆదివారం నడపనున్నారు. ఈ రైలు తిరుపతిలో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 05.25 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. విశాఖపట్నం-తిరుపతి మధ్య రైలు నెం. 08583 ప్రతి సోమవారం నడపనున్నారు. ఇది విశాఖలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి-విశాఖ మధ్య రైలు నెం. 08584 ప్రతి మంగళవారం నడపనున్నారు. ఇది రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకోనుంది. విశాఖ-బెంగళూరు మధ్య రైలు నెం. 08543 ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి విశాఖకు రైలు నె. 08544 ప్రతి సోమవారం నడపనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 03.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 01.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం