Hyderabad National Book Fair 2024 : ఈ నెల 9 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'-hyderabad national book fair to start from feb 9 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad National Book Fair 2024 : ఈ నెల 9 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'

Hyderabad National Book Fair 2024 : ఈ నెల 9 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 04, 2024 12:58 PM IST

Hyderabad National Book Fair 2024: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ నిర్వహకులు వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024
హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 (Hyderabad Book Fair FB)

Hyderabad National Book Fair 2024: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ వెల్లడించారు.

తెలుగు భాషకు పట్టం కడుతూ అన్ని భాషలకు ప్రాధాన్యం కల్పిస్తూ హైదరాబాద్‌లోని గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి నిలువుటద్దంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిలిచిందని జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎన్టీఆర్‌ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో జరిగే పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకప్రదర్శనలో పాలుపంచుకోవాలని, జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ప్రతీ ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు.

సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జూలూరి గౌరి శంకర్ మాట్లాడుతూ… మనకు మనంగా చదువుకుని పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలని, ఎవరికైతే జ్ఞానం అందక అన్నింటిలో వెనుకబడి వున్నారో వాళ్ళకు జ్ఞానాన్ని అందించే పనినే కవులు, రచయితలు, కళాకారులు, సృజనకారులు, సామాజిక కార్యకర్తలు, కలంయోధులు ప్రతి కాలంలో చేస్తూ వస్తున్నారని చెప్పారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి పుస్తకానికుందన్నారు. భావితరాల్ని తీర్చిదిద్దే శక్తి తరగతి గదికి ఉందని, మకిలపట్టిన సమాజం బూజు దులిపే పనిముట్లుగా పుస్తకాలు ఉపయోగపడతాయన్న అచంచల విశ్వాసంతో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ దశాబ్ద కాలంగా ముందుకు సాగుతుందన్నారు.

జ్ఞానతెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలు ఒకమెట్టుగా ఉపయోగపడాలన్న ధ్యేయంతో ముందుకు సాగటం వల్ల రాష్ట్ర అవతరణ తర్వాత పుస్తక ప్రదర్శనలు భారీగా విజయవంతం అవుతూ వస్తున్నాయన్నారు జూలూరి. గత పదేళ్ళుగా హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన టీమ్‌ వర్కుగా ముందుకు సాగటం వల్ల ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా రూపుదాల్చిందని చెప్పారు. మా టీమ్‌కు గత రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా సహకరిస్తోందని వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ పుస్తక ప్రదర్శనలకు ప్రభుత్వం దగ్గర్నుంచి అన్ని పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు అన్ని వర్గాల ప్రజలు అండదండగా నిలిచారన్నారు. అందుకే హైదరాబాద్‌ పుస్తకాల పండగ వినాయక చవితి ఉత్సవంలాగా, రంజాన్‌ పండుగలాగా, క్రిస్టమస్‌ ఫెస్టివల్‌ లాగా పదిలక్షలమంది పుస్తకప్రియులు పాల్గొనే పుస్తక మహోత్సవంగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పుస్తక ప్రదర్శనలకు అండదండగా నిలిచి ఎన్టీఆర్‌ స్టేడియం`తెలంగాణ కళాభారతి స్థలాన్ని 20 రోజులు ఉచితంగా ఇవ్వటం పెద్ద ప్రోత్సాహంగా మారిందన్నారు.

పాఠశాల టీచర్‌ దగ్గర్నుంచి విశ్వవిద్యాలయ ఆచార్యుల వరకు, సికింద్రాబాద్‌ రైలు నిలయం కార్మికుల నుంచి సింగరేణి గని కార్మికుని వరకు అందరూ హైదరబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ను ఆశీర్వదిస్తూ ఇందులో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ పౌర సమాజమంతా పుస్తక ప్రదర్శనకు తోడుగా నిలవటమే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ బలం, బలగంగా నిలిచిందన్నారు. స్వచ్ఛందంగా ప్రచార ప్రసార సాధనాలు తమ వంతు బాధ్యతగా భావించి ఈ పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకున్నాయన్నారు. అన్ని దినపత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాల సంపాదకులు, యాజమాన్యాలు, జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలిపి అండగా నిలిచారని వారికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

గద్దర్ ప్రాంగణం….

36వ జాతీయ పుస్తక ప్రాంగణానికి ‘‘గద్దర్‌ ప్రాంగణం’’ అని పేరు పెట్టామని, పుస్తక ప్రదర్శన వేదికకు ‘‘రవ్వా శ్రీహరి’’ వేదికగా నామకరణం చేశామని జూలూరి గౌరి శంకర్ చెప్పారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమర వీరుల స్తూపాన్ని నెలకొల్పుతున్నామని వివరించారు. తెలంగాణ కల్చర్‌ లో భాగంగా బుక్‌ రీడిరగ్‌ పెంచటం కోసం గత ప్రభుత్వం చేసిన కృషి వల్ల పుస్తక ప్రదర్శనల విస్తృతికి మంచి దారులు పడ్డాయని, ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతుగా నిలిచి ముందుకు నడిపిస్తుందన్నారు.

బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విస్మృత కవులు, రచయితలను వెలుగులోకి తెచ్చేపనిని బుక్‌ ఫెయిర్‌ చేపట్టిందని, విస్తృత కవుల పేరు మీద వేదికలు, ప్రాంగణాలు గత పదేళ్లుగా పెడుతూ వస్తున్నామన్నారు. ఊరూరుకు పుస్తకం తీసుకుపోయే పనిని చేపట్టామని, రొట్టమాకు రేవు నుంచి చిన్నపట్టణాలు వనపర్తి, కోదాడ, కామారెడ్డి లాంటి పట్టణాలకు విస్తరింపచేశామని తెలిపారు. పిల్లలకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని అందరూ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బుక్‌ ఫెయిర్‌ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, కోయ చంద్రమోహన్‌, కోశాధికారి పి.రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు, కార్యవర్గ సభ్యులు కవి యాకూబ్‌, జనార్థన్‌ గుప్తా, బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌, మాటూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ సారిలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే ఈ బుక్ ఫెయిర్ జరగుతుంది. మద్యాహ్నం 2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్