Hyderabad Rain ALERT : హైదారాబాద్‌లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!-one more round of quick heavy downpour ahead in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rain Alert : హైదారాబాద్‌లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

Hyderabad Rain ALERT : హైదారాబాద్‌లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

Basani Shiva Kumar HT Telugu
Sep 06, 2024 05:38 PM IST

Hyderabad Rain ALERT : ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఖమ్మం, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ బాధ నుంచి తేరుకోకముందే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం (@Hyderabadrains)

హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా.. గచ్చిబౌలి లింగంపల్లి, టోలిచౌకి, మెహిదీపట్నం, గోల్కొండ, గండిపేట్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, చార్మినార్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పశ్చిమ, సెంట్రల్, సౌత్ హైదరాబాద్‌పై వర్షాల ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం దంచికొడుతోంది.

మోస్తరు నుంచి భారీ వర్షాలు..

ఇటు ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం, అనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతం మీద ఉందని ఐఎండీ వివరించింది. దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది.

ఇవాళ.. రేపు..

ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాయలసీమ జిల్లాల్లో ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలోనూ..

తెలంగాణలోనూ శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.