Hyderabad Traffic: గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు-ganesh immersion alert tomorrow and day after traffic diversion in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic: గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు

Hyderabad Traffic: గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు

Hyderabad Traffic: భాగ్యనరగంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి రానుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో రేపు, ఎల్లుండి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic: హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్‌ ను నియంత్రిస్తారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (ఎడమ మలుపు), ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌ రోడ్డు)లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని సూచించారు.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే విగ్రహ ఊరేగింపులు సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తుంది.

చిలకలగూడ కూడలి నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ పైవంతెన, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి.

తూర్పు మండలం పరిధిలో..

ఉప్పల్‌ ప్రాంతం నుంచి వచ్చే ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర కూడలి మీదుగా వెళ్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలుస్తోంది.

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్‌ మీదుగా అంబర్‌పేట్‌ వైపు వెళ్తాయి.

తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతుంది.

టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్‌ నిమజ్జనం ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుంది.

ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు వెళ్తోంది.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంటజంక్షన్‌ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు.