Local Body Election : ఓటర్ లిస్టులో మహిళలే అధికం.. ముసాయిదా విడుదల చేసిన అధికారులు
Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మహిళలే అధికంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే శాసించే అవకాశముంది. కరీనంగర్ జిల్లా పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా పరిధిలోని 15 మండలాలు 320 గ్రామపంచాయతీలు, 3 వేల వార్డులు ఉన్నాయి. అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం.. జిల్లాలో పురుష ఓటర్లు 2,57,038 మంది, మహిళా ఓటర్లు 2,69,569 మంది, ఇతరులు 10 మంది మొత్తం 5,26,617 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 12531 ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీల్లో గోడలపై అతికించారు.
21 వరకు అభ్యంతరాల స్వీకరణ..
ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వార్డుల వారీగా ఓటరు జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించారు. వాటిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పంచాయతీ కార్యాలయంలో బిఎల్వో, పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈనెల 21న పంచాయతీల్లో, 26న మండల స్థాయిలో డీపీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
28న గ్రామ పంచాయతీల్లో తుది జాబితాను ప్రదర్శించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు మరో వార్డులో ఉండటం, ఓటర్ల పేర్ల విషయంలో తప్పులు జరగడం తదితర అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను సహాయ ఎన్నికల అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పరిశీలించి మండల స్థాయిలో పరిష్కరిస్తారు. అనంతరం జిల్లా స్థాయిలో పరిశీలించి, సవరణలు పూర్తయిన తర్వాత తుది జాబితాను ఈనెల 28న విడుదల చేస్తారు.
రాజకీయ పార్టీలతో సమావేశం...
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి, ఆడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడానికి తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, అభ్యంత రాల స్వీకరణపై దిశానిర్దేశం చేశారు. ఎంపీడీవోలతో సమావేశాలు ఏర్పాటు చేసి, మండల స్థాయిలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా, ఇతరత్రా విషయాలపై రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండి, సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం, ఒకే వార్డులో ఉండేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)