Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!-warangal lok sabha elections key candidates tension counting day coming close ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

HT Telugu Desk HT Telugu
May 18, 2024 05:42 PM IST

Warangal News : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం కాస్త పెరిగింది. ఎన్నికల్లో ముగిసి ఐదు రోజులు గడుస్తుండగా, అభ్యర్థుల్లో రోజు రోజుకూ టెన్షన్ మొదలైంది.

పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!
పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

Warangal News : లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో గతంలో పోలిస్తే పోలింగ్ శాతం కాస్త పెరిగింది. కాగా పోలింగ్ ముగిసిన అనంతరం రెండు లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఎన్నికలు పూర్తయి ఐదు రోజులు గడుస్తుండగా.. రిలాక్స్ మోడ్ లో ఉన్న అభ్యర్థులకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. వారి భవితవ్యమంతా స్ట్రాంగ్ రూంలోని ఈవీఎంలలోనే నిక్షిప్తమై ఉండటంతో.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయోననే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

స్ట్రాంగ్ రూమ్ ల్లో భవితవ్యం

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లోనే ఉంది. కాగా పోలింగ్ పూర్తయిన తరువాత వరంగల్ లోక్ సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను ఏనుమాముల మార్కెట్ యార్డులోని గోదాంలు, మహబూబాబాద్ స్థానానికి సంబంధించిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ ల పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అంతేగాకుండా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మొదటి దశలో కేంద్ర బలగాలు, ఆ తరువాత ఆర్మ్డ్ సిబ్బంది, వారి అనంతరం స్థానిక పోలీసులతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇక్కడ భద్రతా వ్యవస్థను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిరంతర పర్యవేక్షిస్తుండగా, రోజువారీగా భద్రతను పరిశీలించేందుకు ఏసీపీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇక మహబూబాబాద్ స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఎంట్రన్స్ సమీపంలో కేంద్ర బలగాలు, మధ్యలో ఉన్న ప్రవేశ మార్గం దగ్గర 25 మంది ఆర్మ్డ్ సిబ్బంది, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, చివరి దశలో 25 మంది స్థానిక పోలీసులతో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. ఇలా వివిధ రకాల సాయుధ బలగాలను మోహరించి 24 గంటల పాటు మూడంచెల భద్రత వ్యవస్థతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మహబాబాబాద్ స్ట్రాంగ్ రూం వద్ద కూడా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. వాటిని పోలీస్ ఉన్నతాధికారులకు కనెక్ట్ చేసి, మానిటర్ చేస్తున్నారు. అంతేగాకుండా స్ట్రాంగ్ రూంల వద్ద అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పెరిగిన పోలింగ్ తో అభ్యర్థుల్లో ఉత్కంఠ

వరంగల్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య, బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్, మహబూబాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్, బీజేపీ నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్లా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ నడిచింది. కాగా గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వరంగల్ లో 2019 ఎన్నికల్లో 63.7 పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 68.86 శాతం, మహబూబాబాద్ లో 2019 ఎలక్షన్స్ లో 69.05, ఈసారి 71.85 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగగా.. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇంకొద్ది రోజుల్లోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. తమ భవితవ్యం ఎలా ఉంటుందోనని అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఈ మేరకు పోలింగ్ బూత్ ల వారీగా పోలైన ఓట్ల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. తమ పార్టీ క్యాడర్ తో మంతనాలు జరుపుతూ గెలుపు, ఓటములపై అంచనాలు వేస్తున్నారు. కాగా జూన్ 4న ఈవీఎంలు తెరచుకోనుండగా, ఎవరి భవితవ్యం ఎలా ఉందో తేలాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం