TG Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు-telangana panchayat election voter list draft release schedule confirm by ceo ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు

TG Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 07:51 PM IST

TG Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూలు ఖరారు చేసింది. వచ్చే నెల (సెప్టెంబరు) 6వ తేదీన వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటరు లిస్టులు ప్రకటించాలని నిర్ణయించింది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల తయారీ షెడ్యూల్ ఖరారు

TG Panchayat Elections : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు, పంచాయతీల్లోని వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికే పంచాయతీల పదవీ కాలం ముగిసింది. గత ఏడాది డిసెంబరులోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కేవలం రెండు నెలల తేడాతోనే ఎన్నికల నిర్వహణకు పోలేకపోయింది. ముఖ్యంగా మార్చిలోనే లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పంచాయతీ ఎన్నికల విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, గ్రామాల పాలనను స్పెషల్ అధికారుల చేతుల్లో పెట్టింది.

2019లో తెలంగాణలోని 12, 769 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అప్పటి బీఆరఎస్ ప్రభుత్వం మరో 224 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కలిపి ఇపుడు 12,993 గ్రామ పంచాయతీలు అయ్యాయి. వీటి ఎన్నికల కోసం కులగణన అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణను ముఖ్యంగా బీసీకుల గణను చేపడతామని హామీ ఇచ్చింది. రెండు రోజుల కిందటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కుల గణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది.

ఓటరు లిస్టుల తయారీకి కార్యాచరణ

అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారు చేయించడం, వాటిని ప్రచురించం కోసం రాష్ర్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యుల్ ప్రకారం వచ్చే నెల (సెప్టెంబరు) 6వ తేదీన వార్డు వారీ, గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటరు లిస్టులు ఆయా జిల్లాల్లోని మండల అభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలలో ప్రకటించాలని నిర్ణయించారు. ఆ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై జిల్లా కలెక్టర్లు, మండల అభివృద్ధి అధికారులు వచ్చే నెల 9, 10వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు జరిపి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు.

ఈ డ్రాఫ్ట్ ఓటరు లిస్టులపై సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని వచ్చే నెల 19వ తేదీలోగా పరిష్కరించి 21వ తేదీ నాడు వార్డుల వారీ, గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ, మండల పరిషత్ లలో ప్రచురించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డ్ సభ్యుల పదవులకు జరగవలసిన 2వ సాధారణ ఎన్నికలలో భాగంగా వార్డు వారీ, గ్రామపంచాయతీల వారీగా ఓటరు లిస్టుల తయారీ షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సంబంధిత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నత అధికారులు, ఎలక్షన్ కమిషన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.

( రిపోర్టింగ్ క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

సంబంధిత కథనం