AP Govt : పంద్రాగస్టు వేడుకలపై కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధుల పెంపు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు-ap govt increase in funds to panchayats for conducting independence day celebrations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : పంద్రాగస్టు వేడుకలపై కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధుల పెంపు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

AP Govt : పంద్రాగస్టు వేడుకలపై కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధుల పెంపు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 10, 2024 05:18 AM IST

ఏపీలో పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను పెంచారు. మైనర్ పంచాయతీలకు ఇచ్చే రూ.100ను రూ. 10వేలకు, మేజర్ పంచాయతీలకు ఇచ్చే రూ.250ను రూ. రూ.25 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివరాలను వెల్లడించారు.

ఏపీలో పంద్రాగస్టు వేడుకలకు పంచాయతీలకు నిధుల పెంపు
ఏపీలో పంద్రాగస్టు వేడుకలకు పంచాయతీలకు నిధుల పెంపు

ప్రతీ గ్రామంలో పంద్రాగస్టు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆరోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని తెలిపారు.

yearly horoscope entry point

భారీగా నిధులు పెంపు….

పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉపముఖ్యమంత్రి పవన్ వెల్లడించారు.

2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తామని పవన్ వెల్లడించారు. ఈ మొత్తంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామన్నారు.

పవన్ కళ్యాణ్ ను ఇటీవల పలువురు సర్పంచులు కలిశారు. ఈ  సందర్భంలో పంద్రాగస్టుతో పాటు రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

గత 34 ఏళ్లుగా రూ.వంద, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదనీ, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు నిర్ణయించారు.

పంచాయతీల అధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలను నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. 

పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించటం పాటు ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలని సూచించారు. 

బహుమతులు అందించాలని… పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చివారినీ, పారిశుధ్య కార్మికులను సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు/చాక్లెట్లు అందించాలని… పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Whats_app_banner