Pawan in Karnataka : నాడు అడవిని సంరక్షిస్తే హీరో.. ఇప్పుడు నాశనం చేసి దోచుకెళ్లేవారు హీరో - పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan met Karnataka CM : కర్ణాటకలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఆ రాష్ట్ర సీఎంతో పాటు అటవీశాఖ మంత్రితో సమావేశమయ్యారు. ప్రధానంగా 7 అంశాలపై చర్చించారు.
Deputy CM Pawan met Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏనుగుల సమస్యతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్య్…. రాజకీయ పార్టీలు వేరు కావొచ్చని… కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలమన్నారు. ఒకే సంస్కృతికి చెందిన వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కోసం కృషిచేయాలి అనేది తమ విధానమని వ్యాఖ్యానించారు.
కన్నడ అంటే ఇష్టం - పవన్
అటవీ, జనారణ్యంలో ఏనుగుల బీభత్సం, వన్యప్రాణుల వేట, ఎర్ర చందనం స్మగ్లర్ల అంశంపై చర్చించడానికి అడిగిన వెంటనే స్పందించి కలిసి చర్చించే అవకాశం ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు కన్నడ భాష అంటే చాలా ఇష్టమని…., సరిహద్దులు పంచుకుంటున్నప్పటికి కన్నడలో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. కన్నడ నేర్చుకుని హృదయం నుంచి మాట్లాడాలని ఉందని తెలిపారు.
అలా చేసేవారే హీరో….
తాను ఉప ముఖ్యమంత్రిగా అవ్వకముందు ముందు నుంచే ప్రకృతి సంరక్షకుడినని పవన్ చెప్పారు. ఇప్పుడు అటవీ శాఖా మంత్రిగా మరింత బాధ్యత ఉందన్నారు. “నాకు అటవీ సంరక్షణ పట్ల మొదటగా చైతన్యం కల్పించింది కన్నడ కంఠీరవ శ్రీ రాజ్ కుమార్ గంధాద గుడి సినిమా. ఆ సినిమా అటవీ శాఖా అధికారులు అటవిని పరిరక్షించడం అనే అంశంపై తీశారు. 40 ఏళ్ల క్రితం అటవీని సంరక్షించే వారు హీరో. ఇప్పుడు అడవిని నాశనం చేసి, దోచుకెళ్లె వారు హీర. అలా మారిపోయింది సంస్కృతి” అంటూ కామెంట్స్ చేశారు.
“ఈ భూమి అనేది కేవలం మనుషులది కాదు. అన్ని జంతువులది, జీవ జాతులది. వసుదైక కుటుంబం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు అనేది అందరూ అర్దం చేసుకుని పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది” అని పవన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 140 కోట్ల విలువైన ఎర్ర చందనం కర్ణాటకలో పట్టుబడిందనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇంతలా ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతుంది. శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రానికి భూముల రెన్యువల్ అంశం నా దృష్టికి వచ్చింది. దీనిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తాను.శ్రీశైలం, తిరుపతి క్షేత్రాలు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పటికీ అవి మొత్తం భారతదేశానికి చెందిన సంపద. మాకు అన్ని రకాలుగా సహకరిస్తామని మాట ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాాాదాలు తెలుపుతున్నాను" అని పవన్ అన్నారు.
చర్చించిన అంశాలు :
- ఎర్ర చందనం అక్రమ రవాణా.
- వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు .
- ఎకో టూరిజం అభివృద్ది .
- వన్యప్రాణుల వేట అరికట్టడం, వేటగాళ్లను నియంత్రించడం.
- ఏనుగులు, మనుషుల మధ్య ఘర్షణలు తగ్గించడం, జనారణ్యంలోకి రాకుండా అడ్డుకోవడం.
- ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం.
- తరచుగా అటవీ సంబంధిత అంశాల్లో చర్చల్లో పాల్గొనటం వంటి అంశాలపై చర్చించినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.