TG Indiramma Housing Scheme Updates : దరఖాస్తుల వడపోతపై కసరత్తు! తెరపైకి కొత్త ప్రతిపాదనలు - ఆ తర్వాతే తుది జాబితా..!-scrutiny of indiramma housing scheme applications is likely to be completed within three months ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Housing Scheme Updates : దరఖాస్తుల వడపోతపై కసరత్తు! తెరపైకి కొత్త ప్రతిపాదనలు - ఆ తర్వాతే తుది జాబితా..!

TG Indiramma Housing Scheme Updates : దరఖాస్తుల వడపోతపై కసరత్తు! తెరపైకి కొత్త ప్రతిపాదనలు - ఆ తర్వాతే తుది జాబితా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 15, 2024 06:57 AM IST

Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టా లెక్కనుంది. ఇప్పటికే పథకాన్ని ప్రారంభించగా… త్వరలోనే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని సర్కార్ భావిస్తోంది.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్

Indiramma Housing Scheme Updates: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం…ఆరు గ్యారెంటీల హామీలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుండగా… కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్(Telangana Indiramma Housing Scheme) పై పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలని చూస్తోంది. 

మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ స్కీమ్ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయటంతో…. మళ్లీ ఈ స్కీమ్ పై సర్కార్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.

ఈ స్కీమ్ కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదలైన సంగతి తెలిసిందే.  బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కూడా కేటాయించింది. ఇంటి నిర్మాణానికి నాలుగు దశల్లో  ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. ఈ స్కీమ్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే కాకుండా… హడ్కో కూడా రూ.1,000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. దీంతో ఈ స్కీమ్ కింద లబ్ధిదారులను గుర్తించి… ఇళ్ల పట్టాలను అందజేయాలని సర్కార్ భావిస్తోంది.

భారీగా దరఖాస్తులు….

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఏకంగా వీటి సంఖ్య 82.82 లక్షలుగా ఉంది ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది.  ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను కూడా అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారుల బృందాలు… ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి పలు వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు.

మంజూరు అయిన ఇళ్ల సంఖ్యకు.. వచ్చిన దరఖాస్తులకు భారీగా తేడా ఉంది.  ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని సర్కార్ ప్రకటించింది. కానీ ఒక్కో నియోజకవర్గం నుంచే భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఓవైపు వడపోత ప్రక్రియలో కొన్ని దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ…. ఇంకా కూడా చాలా అప్లికేషన్లు ఉండే అవకాశం ఉంది. 

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది.  లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చిన దరఖాస్తుల్లో ప్రాథమికంగా అర్హత పొందిన వాటిని వేరు చేయనున్నారు. వాటి వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రాస్ చెక్ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ పరిశీలన ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

భారీగా అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో… లబ్ధిదారుల ఎంపికే అతిపెద్ద సవాల్ గా మారిందని చెప్పొచ్చు. త్వరలోనే ఈ స్కీమ్ కు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. అయితే అధికారులు ప్రతిపాదిస్తున్న పలు అంశాలపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది…!

ఎవరు అర్హులు…?

పేదవాళ్ల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వటం, స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందజేయటం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. 

ఈ స్కీమ్ అమలులో భాగంగా ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది సర్కార్. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. 

లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జి.

WhatsApp channel