Tirumala: గరుడసేవకు వచ్చే భక్తులకు అలర్ట్… పార్కింగ్ ప్రాంతాలన్నీ పుల్
tirumala brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని భక్తులకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
Tirumala Srivari Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగే ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని శ్రీవారి భక్తులకు పోలీసులు కీలక అలర్ట్ ఇచ్చారు. తిరుమల నందు వాహనాల పార్కింగ్ ప్లేస్ లన్ని పూర్తిగా వాహనాలతో నిండినందున అలిపిరి టోల్గేట్ నుండి ప్రైవేట్ వాహనాలను నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు.
వాహనాల ద్వారా వచ్చే భక్తులు తిరుపతి నందు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని తిరుమలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఆలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు కార్లు, వ్యాన్లు మరియు ఏ ఇతర ప్రవేట్ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడదని స్పష్టం చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు.
మరోవైపు గరుడ సేవకు వచ్చే భక్తులు తప్పని సరిగా కార్ పాసులు తీసుకోవాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిర్దేశించిన కార్ పాస్ సెంటర్ల వద్ద పాస్‌లు జారీ చేశారు. ఇప్పటికే గరుడసేవకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దాదాపు 3 లక్షల మందికి శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు. గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తంగా భక్తులు భావిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.