Telugu News  /  Telangana  /  Telangana And Andhra Pradesh Live News Updates September 30 2022

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు(HT)

September 30 Telugu News Updates : బ్రహ్మోత్సవాల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారు

Today Telugu News Updates: సెప్టెంబర్ 30 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

Fri, 30 Sep 202216:44 IST

సర్వభూపాల వాహనంపై శ్రీవారు…

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు

Fri, 30 Sep 202216:23 IST

ఎన్నికలపై ఈసీ కసరత్తు…

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియ శనివారం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కే జనార్ధన్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. ఈ క్రమంలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. డీనోవా పద్ధతిలో ఓటరు జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. దీని ప్రకారం గతంలో ఉన్న ఓటు హక్కుతో సంబంధం లేకుండా మళ్లీ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు కోసం అర్హులైన ఉపాధ్యాయులు ఫారం-18 సమర్పించాల్సి ఉంటుంది.

Fri, 30 Sep 202216:03 IST

కొత్త ట్రాఫిక్ రూల్స్…..

ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అక్టోబర్ 3 నుంచి కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నారు.స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Fri, 30 Sep 202215:32 IST

సలహాదారు రాజీనామా……. 

ఏపీ ప్ర‌భుత్వంలో విద్యా శాఖ స‌ల‌హాదారుగా ప‌నిచేస్తున్న తెలంగాణ‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ముర‌ళి త‌న ప‌ద‌వికి శుక్ర‌వారం రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ఆయ‌న సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పంపారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్ట‌గానే... ప‌లువురు వ్య‌క్తుల‌ను జ‌గ‌న్ స‌ర్కారు స‌ల‌హ‌దారులుగా నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిలో ప‌లువురు తెలంగాణ‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలా తెలంగాణ‌కు చెందిన ముర‌ళి ఏపీ విద్యా శాఖ స‌ల‌హాదారుగా నియ‌మితుల‌య్యారు. గ‌డ‌చిన మూడేళ్లుగా ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాన‌న్న విష‌యాన్ని జ‌గ‌న్‌కు రాసిన లేఖ‌లో ముర‌ళి వివ‌రించారు. త‌న సొంత రాష్ట్రం తెలంగాణ‌లో విద్య‌, వైద్యం ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని, ఆ ప‌రిస్థితుల‌ను మెరుగుప‌ర‌చేందుకే తాను స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. త‌న సేవ‌లు ఇప్పుడు ఏపీ కంటే త‌న సొంత రాష్ట్రానికే అవ‌స‌ర‌మ‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీలో విద్యా శాఖ‌కు ప్ర‌త్యేకించి పాఠ‌శాల‌ల మెరుగుద‌ల‌కు జ‌గ‌న్ అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చార‌న్నారు. ఈ శాఖ‌కు తాను స‌ల‌హాదారుగా ప‌నిచేయ‌డం త‌న‌కు గొప్ప అనుభూతి ఇచ్చింద‌ని కూడా ముర‌ళి పేర్కొన్నారు.

Fri, 30 Sep 202215:31 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మాడవీధుల్లో సర్వభూపాల వాహనంపై శ్రీవారి విహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

Fri, 30 Sep 202214:12 IST

వారు మేజర్లే…. 

రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్‌ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం మేజర్ గా పరిగణించింది.

Fri, 30 Sep 202213:39 IST

సీఎం జగన్ ఆదేశాలు…. 

ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సి స్థాయిలో సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖపై సమీక్ష చేపట్టిన ఆయన.. పలు అంశాలపై సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో ప్రతినెలా ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. ఈ ఆడిట్‌ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలన్నారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్న ముఖ్యమంత్రి... ఎక్కడ ఖాళీ వచ్చినా జాప్యం లేకుండా మరొకరిని వెంటనే నియమించాలని తెలిపారు.

Fri, 30 Sep 202212:28 IST

ఫేక్ కరెన్సీ సీజ్

 

గుజరాత్ లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 29వ తేదీన ఓ అంబులెన్స్ లో తరలిస్తున్న రూ.25 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 6 బాక్సుల్లో 1290 బండిల్స్‌లో నోట్ల‌ను త‌ర‌లించినట్లు కమ్రెజ్ పోలీసులు వెల్లడించారు.ఈ నోట్ల‌ను ఎక్క‌డ ముద్రించి ఏ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నార‌నేది దానిపై విచారిస్తున్నారు. 

Fri, 30 Sep 202211:46 IST

మంత్రి హరీశ్ పై ఫైర్…. 

తెలంగాణ మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు .. ఏపీలో టీచర్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల గురించి స్పందించారు. ఇప్పుడు ఆ కామెంట్సే ఇరు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్‌కు కారణమయ్యాయి. హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడారో అర్ధం కావడం లేదన్న సజ్జల.. ఇది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను విమర్శించి రెచ్చగొట్టాలని చూస్తున్నట్టుగా కన్పిస్తుందని అనుమానించారు. ఏదో గ్యాంగ్‌తో జతకట్టి హరీష్ రావు మాట్లాడినట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రులు బొత్స, అమర్ నాథ్ కూడా హరీష్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. #

Fri, 30 Sep 202211:24 IST

హైకోర్టు సీరియస్….. 

బిగ్ బాస్ షోలోని అశ్లీలతపై ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్‌ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. బిగ్​బాస్ షోలో అశ్లీలత పెరిగిందంటూ దాఖలైన పిల్ పై న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్​బాస్ రియాల్టీ షోలో ఐబీఎఫ్ గైడ్​లైన్స్ పాటించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.అశ్లీలత ఎక్కువగా ఉందని వాదించారు.

Fri, 30 Sep 202210:54 IST

షిర్డీ టూర్… 

Shirdi Shani Shingnapur Tour From Hyd: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలను www.irctctourism.com వెబ్ సైట్ లో చూడవచ్చు. 

Fri, 30 Sep 202210:19 IST

 ఈడీ నోటీసులు….

ED On National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Fri, 30 Sep 20229:54 IST

సీఎం సమీక్ష….

వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ భేటీకి మంత్రి రజనితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Fri, 30 Sep 20229:54 IST

సీఎం కేసీఆర్ విరాళం….

cm kcr offered 16 kgs of gold for yadadri: రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం కిలో 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. అంతకుముందు కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Fri, 30 Sep 20228:38 IST

సీఎం కేసీఆర్ టూర్…..

సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ దంపతులు.. బస్సులోనే కొండ చూట్టు ప్రదక్షిణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ చేరుకున్నారు. ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు.

Fri, 30 Sep 20227:57 IST

తిరుపతిలో  కాంగ్రెస్ పార్టీ సంబరాలు.

తిరుపతిలో రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహించారు. ️ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు.  దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని,  ఎస్సీ వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు కాబోతున్నారని చెప్పారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  300 స్థానాల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పారు. 1960లో జవహర్ లాల్ హయాంలో ఎస్సీ వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులు చేశారని గుర్తు చేశారు.  ఇందిరా గాంధీ హయాంలో జగజ్జీవన్ రామ్ ఏఐసీసీ అధ్యక్షులు అయ్యారని,  ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో మల్లికార్జున్ ఖర్గేని అధ్యక్షులు చేయడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. 

 

Fri, 30 Sep 20227:38 IST

ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఏం చేసింది. 

ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. బొత్స చెప్పినట్లుగా మంత్రి హరీష్ రావు ఏపీకి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడితే రాష్ట్రం పరువే పోతుందన్నారు.   ఏపీలో తమ పరిస్థితి బాగోలేదని ఉపాధ్యాయ సంఘాలే చెబుతున్నాయని,   ఏపీలో ఉపాధ్యాయులను ఉదాహరణగా చూపి తెలంగాణ టీచర్లను హరీష్ రావు భయపెట్టడం.. ఏపీ రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందన్నారు. 

Fri, 30 Sep 20227:21 IST

ఇంద్రకీలాద్రిపై అపశృతి

ఇంద్రకీలాద్రి వద్ద అపశృతి చోటు చేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన హైదరాబాద్ కి‌చెందిన మూర్తి అనే భక్తుడు  క్యూలైన్ లో ఉండగా సొమ్మసిల్లి  పడిపోయాడు. అస్వస్థతకు గురైన మూర్తిని స్టెచర్‌పై ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ మూర్తి మృతి చెందాడు.  500 రూపాయల క్యూ లైన్ మార్గంలో దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్ మార్గంలో వేచి ఉండగా పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే అతనికి సపర్యలు చేసి అంబులెన్స్‌లో బయటకు తరలించారు. 

Fri, 30 Sep 20227:13 IST

బీజేపీతోనే విశాఖ అభివృద్ధి

విశాఖలో కనిపించే ప్రతి అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఉంది,  విశాఖకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు ఎంపీ జివిఎల్ నరసింహరావు.  సామాన్యులకు అందుబాటులో ఉన్న రుషికొండ గెస్ట్ హౌస్ ను పడగొట్టారని,  రుషికొండలో ఏం కడుతున్నారో ఇప్పటికన్నా చెప్పాలని డిమాండ్ చేశారు.  విశాఖ అభివృద్ధికి వైసీపీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? – గత ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాలు చేయించి ఇళ్లు కేటాయించలేదని,   ఇప్పుడు వైసీపీ ఆలోచన కూడా అలాగే ఉందని  బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. 

Fri, 30 Sep 20226:33 IST

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ విడుదల చేశారు. దాదాపు నాలుగు లక్షలకు పైగా అభ్యర్ధులు ఈ ఏడాది టెట్ పరీక్షలకు హాజరయ్యారు. 57శాతం మంది ఉత్తీర్ణత సాధింరు. టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

Fri, 30 Sep 20225:49 IST

ఎంఎంటిఎస్‌కు తప్పిన ముప్పు

హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో రైలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రగంలోకి దిగిన రైల్వే అధికారులు సమస్యకు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.బేంగపేట్‌, నెక్లెస్‌ రోడ్‌ స్టేషన్ల మధ్య పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు గుర్తించారు

Fri, 30 Sep 20225:44 IST

పోలీసులపై సస్పెన్షన్ వేటు

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఎస్సై షేక్ జబీర్ పై సస్పెన్షన్ వేటు పడింది.   మద్యం వ్యాపారులకు అండగా ఉంటున్నారని ఎస్సై జబీర్ పై ఆరోపణలు వచ్చాయి.  పోలీసుల విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎస్సైపై వేటు వేశారు. 

Fri, 30 Sep 20225:43 IST

గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు.  నేతల మధ్య సమన్వయం, కలసికట్టుగా కార్యక్రమాల అంశాలపై చర్చ జరుగనుంది.  ఉమ్మడి జిల్లా యూనిట్‍గా తీసుకుని ఐక్యంగా పనిచేయాలని గుంటూరు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఉమ్మడి జిల్లా యూనిట్‍గా తీసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే కృష్ణా జిల్లా నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. 

Fri, 30 Sep 20225:42 IST

గాలి బెయిల్ పిటిషన్‌పై విచారణ

గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ నిబంధనలు సడలింపు కేసు నేటీకి వాయిదా పడింది. ఉత్తర్వులు జారీపై విచారణను సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది. బిడ్డకు జన్మనిచ్చిన కుమార్తెను చూసేందుకు అనుమతి కోరిన గాలి జనార్దన్ రెడ్డి, - బళ్లారిలో నాలుగు వారాలు ఉండేందుకు అవకాశమివ్వాలని కోరారు.  గాలి జనార్దన్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ స్పందన కోరింది.తమ నిర్ణయాన్ని నేడు తెలుపుతామని సీబీఐ అధికారులు  కోర్టుకు వివరించారు. సీబీఐ నిర్ణయం మేరకు నేడు  సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. 

Fri, 30 Sep 20225:39 IST

బీజేపీ ప్రచార వాహనానికి నిప్పు

తెనాలిలో బీజేపీ ప్రజాపోరు యాత్ర వాహనానికి నిప్పు పెట్టారు.  తెల్లవారు జామున నాలుగు గంటలకు వాహనానికి  దుండగులు నిప్పంటించారు. సుల్తానాబాద్లో నిలిపి వుంచిన ప్రచార రథానికి  దుండగులు నిప్పంటించారు.  మంటలు రావడంతో అప్రమత్తమై ఆపేసిన స్థానికులు వాటిని ఆర్పి వేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. 

Fri, 30 Sep 20225:37 IST

ఏలూరులో రైతుల పాదయాత్ర

ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి  రైతుల పాదయాత్ర చేరుకుంది.  ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది.  పాదయాత్రలో  మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు. - అమరావతి రైతులకు సంఘీభావం  తెలిపారు. పంగిడిగూడెం నుంచి ద్వారకాతిరుమల వరకు యాత్ర సాగనుంది.

ఆర్టికల్ షేర్ చేయండి