LIC and Infosys : ఇన్ఫోసిస్ సహకారంతో డిజిటల్‌గా మారుతున్న ఎల్‌ఐసీ!
LIC and Infosys : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్‌ఐసీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు భారతదేశపు ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌తో కలిసి పని చేయనుంది. ఈ ఐటీ కంపెనీ సహకారంతో డిజిటలైజ్ చేయనుంది.
LIC భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీ. ప్రస్తుతం బీమా రంగంలో ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వివిధ ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయినప్పటికీ ఎల్ఐసీది ప్రత్యేకమైన స్థానం. ఈ సందర్భంలో ఆధునిక తరానికి అనుగుణంగా డిజిటలైజ్ చేయాలని ఎల్ఐసీ నిర్ణయించింది. అంటే ఎల్ఐసీ తమ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని యోచిస్తోందన్నమాట. ఇందుకోసం కంపెనీ ఇన్ఫోసిస్‌ను సంప్రదించింది.
DIVE (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్) ప్రోగ్రామ్ ద్వారా LIC తన కార్యకలాపాలను ఆధునిక యుగానికి అనుగుణంగా మారుస్తోంది.
ఇందుకోసం ఎల్‌ఐసీకి సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఏఐ ఫంక్షన్ల ఇంటిగ్రేషన్ సహా సేవలను ఇన్ఫోసిస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఎల్‌ఐసీ డిజిటల్‌గా మారడానికి అవసరమైన అన్ని అంతర్గత మౌలిక సదుపాయాలను ఇన్ఫోసిస్ నిర్మిస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఏ ప్రక్రియలపైనా ప్రభావం పడకుండా ఈ చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. తదుపరి తరం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఎల్‌ఐసీ కంపెనీని ఉపయోగించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. అంటే ఫిన్‌టెక్ కంపెనీల సహకారంతో వివిధ సౌకర్యాలను తీసుకువస్తున్నారు.
ఎల్‌ఐసీ కస్టమర్లందరూ లేదా ఎల్‌ఐసీతో బీమా పొందాలనుకునే వారు ఈ డిజిటల్ టూల్‌ను సులభమైన మార్గంలో ఉపయోగించుకోగలుగుతారు. ఇందుకోసం బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలతో ఎల్‌ఐసీ ఒప్పందం చేసుకుంది. ఎల్ఐసీ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో ఇన్ఫోసిస్‌తో తమ బంధం ఒక ప్రధాన మైలురాయి అని ఎల్ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతి అన్నారు. అదేవిధంగా ఎల్‌ఐసీకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సహకరించడం ఆనందంగా ఉందని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ చెప్పారు.
'డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలలో ఇన్ఫోసిస్‌కు విస్తృతమైన అనుభవం ఉంది. AI, క్లౌడ్‌లో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా, అత్యుత్తమ కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను అందించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో LICని సన్నద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.' అని ఇన్ఫోసిస్ CEO, MD సలీల్ పరేఖ్ అన్నారు.