Jagtial Collector : తలపాగ చుట్టి.. పట్టువస్త్రాలు సమర్పించి - ధర్మపురిలో ప్రత్యేకతను చాటిన కలెక్టర్ యాస్మిన్ బాష
Jagtial Collector Yasmeen Basha: ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి జిల్లా కలెక్టర్… యాస్మిన్ బాషా పట్టువస్త్రాలు సమర్పించారు.
Dharmapuri Lakshmi Narasimha Swamy Jatara 2024 : జాతరకు వెళ్ళితే ఎదో ఒక వస్తువు కొంటాం. చిన్నదా, పెద్దదా అని చూడకుండా జాతర గుర్తుగా ఓ వస్తువు కొని మురిసిపోతాం. హోదాతో సంబంధం లేకుండా జాతరంటే ఎవ్వరైనా మక్కువ చూపుతారు. అలానే జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా(Jagtial Collector Yasmeen Basha)… ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 13 రోజులపాటు జరిగే లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్, జాతరలో కలియ తిరిగారు. దుకాణాలను పరిశీలించి గాజులు కొనుగోలు చేశారు. స్వయంగా గాజులు వేసుకుని మురిసిపోతూ దుకాణదారురాలుకు ఐదువందల కరెన్సీ నోటు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు. కలెక్టర్ జాతరలో తిరిగి గాజులు కొనుగోలు చేయడం స్థానికులు ఆశ్చర్యంగా చూశారు.
లక్ష్మీనరసింహుడి కళ్యాణ వైభోగం..
Dharmapuri Lakshmi Narasimha Swamy Jatara 2024: ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కలశస్థాపన పూజలతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గోధూలి సుముహూర్తాన స్వామివారల కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామి వారలకు జగిత్యాల కలక్టర్ యాష్మిన్ భాషా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పట్టువస్త్రాలు సమర్పించాల్సిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దూరంగా ఉండి భక్తుడు గా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ముస్లీం మహిళ అయిన జగిత్యాల కలెక్టర్ యాష్మిన్ భాషా సాంప్రదాయాలు పాటీస్తు హిందూదేవాలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం జనం ఆసక్తిగా చూశారు. అదృష్టంగా పుర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు.
దక్షిణ కాశీ గా పేరొందిన ధర్మపురి లో 13 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు తెప్పోత్సవం.. డోలోత్సవం నిర్వహిస్తారు. 21న స్వామి వారల కళ్యాణం నిర్వహించిన ఆలయ అధికారులు అర్చకులు, 24న యోగా నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు. 25న ఉగ్ర నరసింహస్వామి తెప్పోత్సవం… డోలోత్సవం, 26న శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం… డోలోత్సవం నిర్వహిస్తారు. 29న ముగ్గురు స్వాముల రథోత్సవం కన్నుల పండువలా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ప్రకటించారు.
రిపోర్టింగ్ - కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హెచ్ టీ తెలుగు
సంబంధిత కథనం