AP Police : వరదలపై వదంతులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్!-ap police serious warning to whatsapp group admins ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police : వరదలపై వదంతులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్!

AP Police : వరదలపై వదంతులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్!

Basani Shiva Kumar HT Telugu
Sep 03, 2024 02:57 PM IST

AP Police : ఓవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఈ కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గ్రూపుల అడ్మిన్‌లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్

ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడింది. విజయవాడలో విలయం సృష్టించింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతోంది. అయితే.. కొందరు దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారని ప్రభుత్వ సీరియస్ అయ్యింది. బాధితులకు సాయం అందించడంలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని.. అంతేకాని ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్ ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చంద్రబాబు సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలీసుల ఫోకస్..

తప్పుడు ప్రచారం చేస్తూ.. వరద బాధితులను ఆందోళనకు గురిచేస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పలు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఫేక్ న్యూస్, వరదలపై వదంతులు, బాధితులకు అందే సహాయంపై విష ప్రచారం ఏ వాట్సాప్ గ్రూప్ ద్వారా అయ్యిందని ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఏ గ్రూపులో షేర్ చేసినా.. గ్రూప్ అడ్మిన్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అడ్మిన్ లపై చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

ఉద్దేశపూర్వకంగా చేస్తే..

ఫేక్ న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయకుండా.. కొందరు అడ్మిన్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఫేక్ న్యూస్‌ను మరింత మందికి చేరేలా షేర్ చేస్తున్నారు. ఇటువంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. వీరంతా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై బురదజల్లేందుకు, ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిపైనా నిఘా పెట్టారు.

మరో అల్పపీడనం..

ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.

పాల కోసం..

భారీ వర్షం, వరదల కారణంగా.. విజయవాడలో తీవ్ర పాల కొరత ఏర్పడింది. పాల ప్యాకెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. విజయ డెయిరీ యూనిట్‌ను వరద నీరు కమ్మేసింది. బుడమేరు ఉధృతితో డెయిరీలోకి వర్షపు నీరు చేరింది. డెయిరీ యూనిట్‌ లోపల నడుం లోతుకు నీరు వచ్చింది. 1.50 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లు,పెరుగు నీట మునిగాయి. పాల ప్యాకెట్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు.